సిద్ధిపేట: పలు దొంగ నోట్ల కేసుల్లో నిందితుడైన ఎల్లంగౌడ్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట జిల్లా రామంచ సమీపంలో జరిగింది. ఎల్లంగౌడ్ పై 16 దొంగ నోట్ల కేసులున్నాయి. వాటిలో నాలుగు కర్ణాటకలో నమోదైన కేసులు.

ఐదేళ్ల క్రితం ఎల్లంగౌడ్ ముఠా హైదరాబాదు సమీపంలోని శామీర్ పేటలో పోలీసులపైకి కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఓ కానిస్టేబుల్ మరణించాడు. ఎస్సై వెంకటరెడ్డి తీవ్రంగా గాయపడి ప్రాణాలతో బయటపడ్డారు. పోలీసులపై కాల్పులు జరిపిన తర్వాత ఎల్లంగౌడ్ సిద్ధిపేట వన్ టౌన్ పోలీసు స్టేషన్ లో లొంగిపోయాడు.

ఎల్లంగౌడ్ ను అతని ముఠాలో భాగస్వామి అయిన తడకపల్లి వెంకట్ ముఠా చంపినట్లు తెలుస్తోంది. ముగ్గురు వ్యక్తులతో కలిసి తడకపల్లి వెంట్ ఎల్లంగౌడ్ ను చంపినట్లు తెలుస్తోంది. తడకపల్లి వెంకట్ ముఠా సిద్ధిపేట పోలీసు కమిషనరేట్ లో లొంగిపోయింది.

అంబటి ఎల్లంగౌడ్ ను అత్యంత దారుణంగా హత్య చేశారు. తలను నరికి మొండెం నుంచి వేరు చేశారు. కుడి చేతిని కూడా నరికారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.