ప్రేమ పేరిట మైనర్ బాలికను వేధించి.. ఆమెపై దాడి చేసినందుకు ఓ వ్యక్తికి న్యాయస్థానం సంవత్సరం జైలు శిక్ష విధించింది. పూర్తి వివరాల్లోకి వెళితే... ఆర్జీకే కాలనీ కి  చెందిన శ్రవణ్ కుమార్ అలియాస్ శ్యామ్(24) గత కొంతకాలంగా ఓ మైనర్ బాలికను ప్రేమ పేరిట వెంబడిస్తున్నాడు.

అతని ప్రేమను బాలిక రిజెక్ట్ చేసింది.దీంతో కోపోద్రిక్తుడైన శ్రవణ్ ఆమెపై దాడి చేశాడు. అంతేకాకుండా బాలిక ఫోన్ లాక్కోని.. ఆమె ఫోన్ నుంచి తన ఫోన్ కి కొన్ని మెసేజ్ లు పంపుకున్నాడు. బాలిక కూడా తనను ప్రేమిస్తుందనే నమ్మకం కలిగించేలా మెసేజ్ పంపుకున్నాడు. అనంతరం వాటిని చూపించి ఆమెను బ్లాక్ మొయిల్ చేయడం మొదలుపెట్టాడు.

అతని వేధింపులు రోజు రోజుకీ తీవ్రతరం కావడంతో బాలిక తన తల్లిదండ్రుల సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడు శ్రవణ్ ని అరెస్టు చేశారు. అనంతరం అతనిని కోర్టులో హాజరుపరిచారు. కాగా.. అతనికి న్యాయస్థానం సంవత్సరం పాటు జైలు శిక్ష విధించింది.