తూప్రాన్ మండల పరిధిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో కారు నడపిన వ్యక్తులు ముగ్గురిని గాయపరిచారు. ఓ కరెంట్ స్తంభాన్ని ఢీ కొట్టి కారు ఆగడంతో.. ఆ వ్యక్తులు పరారయ్యారు.  

మనోహరాబాద్ : మద్యం మత్తులో ఉన్న ముగ్గురు కారుతో బీభత్సం సృష్టించారు. ముగ్గురిని ఢీకొట్టిన అనంతరం విద్యుత్ స్తంభానికి ఢీకొని కారు ఆగిపోవడంతో.. కారును అక్కడే వదిలి పారిపోయారు. ఈ ఘటన మండల పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలు… తూప్రాన్ మండలం అల్లాపూర్ టోల్ ప్లాజా సమీపంలోని ఓ క్రషర్ లో పనిచేసే ఇతర రాష్ట్రాలకు చెందిన ముగ్గురు వ్యక్తులు మద్యం తాగారు. ఆ తరువాత కారులో జాతీయ రహదారి నుంచి లింగారెడ్డి పేట గ్రామంలోకి ప్రవేశించారు. వాహనం నడుపుతున్న వ్యక్తి మద్యం మత్తులో అదే మార్గంలో ద్విచక్రవాహనంపై వెళుతున్న నర్ర రతన్ ను ఢీకొట్టాడు. దీంతో అతనికి గాయాలవగా ద్విచక్రవాహనం సైతం ధ్వంసమైంది. 

ఆ తర్వాత కాలినడకన వెళ్తున్న మల్లయ్య, మరో మహిళను ఢీ కొట్టగా వారు సైతం గాయపడ్డారు. స్థానికులు వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆ తర్వాత వేగంగా వెళ్ళిన వారి కారు గ్రామంలోని విద్యుత్ స్తంభానికి వేగంగా ఢీ కొట్టింది. అక్కడే కారు ఆగిపోయింది. ఈ ఘటనలో స్థంభం పడిపోయింది. అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కారు ఆగిపోవడంతో వాహనంలోని ముగ్గురు అక్కడి నుంచి పరారయ్యారు. గ్రామస్తులు అందులో పరిశీలించగా మద్యం, శీతల పానీయం సీసాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయమై మనోహరాబాద్ ఎస్సై రాజు గౌడ్ వివరణ కోరగా ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.

ఇదిలా ఉండగా, మే 6న రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి satyavathi rathod ప్రయాణిస్తున్న కారు mahabubabad district మరిపెడలో గురువారం accidentకి గురైంది. హైదరాబాద్ నుంచి మహబూబాబాద్ కు వెళ్లున్న క్రమంలో మరిపెడ పట్టణానికి చేరుకోగానే ఓ పంది అకస్మాత్తుగా రోడ్డు మీదికి వచ్చింది. దీంతో మంత్రి ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొట్టింది. వాహనం ముందు భాగం దెబ్బతింది. కాన్వాయ్ లో ఉన్న మరో మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొని స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో మంత్రికి గాయాలేమీ కాలేదు. ఆమె క్షేమంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే మంత్రి మరో కారులో మహబూబాబాద్ కు బయలుదేరి వెళ్లారు. 

మరో వైపు ఈ ఘటనకు సంబంధించి మరో వాదన వినిపిస్తుంది. సత్యవతి రాథోడ్ కాన్వాయ్ లోని రెండు వాహనాలు ఢీకొన్నాయి. మంత్రి సత్యవతి రాథోడ్ హైదరాబాద్ నుంచి మహబూబాబాద్ వెడుతుండగా.. మరిపెడ కార్గిల్ సెంటర్ సమీపంలోకి రాగానే కాన్వాయ్ కి పంది అడ్డువచ్చింది. దీంతో ఒక్కసారిగా డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు. దీనివల్ల వెనుక వస్తున్న వాహనం వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో గన్ మెన్ లకు స్వల్పగాయాలు కాగా, మంత్రి సత్యవతి రాథోడ్ సురక్షితంగా బయటపడ్డారు. వెంటనే వేరే వాహనంలో మహబూబాబాద్ చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వాహనాలను క్లియర్ చేశారు.