Asianet News TeluguAsianet News Telugu

ఆమె ఉత్తమ తహశీల్దార్.. ఇంట్లో ఎక్కడ చూసినా నోట్ల కట్టలే!

మరో అవినీతి తిమింగళం బయటపడింది. తీగలాగితే డొంక అంతా కదిలినట్లు.... ఓ వీఆర్వో రెడ్ హ్యాండెడ్ గా దొరికితే... అతని ద్వారా తహశీల్దార్ బండారం బయటపడింది.

ACB raids in tahsildar home, found rs.93lakhs
Author
Hyderabad, First Published Jul 11, 2019, 7:43 AM IST


మరో అవినీతి తిమింగళం బయటపడింది. తీగలాగితే డొంక అంతా కదిలినట్లు.... ఓ వీఆర్వో రెడ్ హ్యాండెడ్ గా దొరికితే... అతని ద్వారా తహశీల్దార్ బండారం బయటపడింది. తహశీల్దార్ ఇంట్లో అవినీతి శాఖ అధికారులు సోదాలు చేపట్టగా... రూ.93లక్షల నగదు బయటపడింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలో చోటుచేసుకుంది.

అసలు మ్యాటర్ లోకి వెళితే... రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం దత్తాయపల్లి వీఆర్వోగా పని చేసిన అనంతయ్య ఇటీవలే బదిలీపై కొందుర్గుకు వచ్చారు.దత్తాయపల్లికి చెందిన మామిడిపల్లి చెన్నయ్యకు 12 ఎకరాల భూమి ఉంది. అందులో 9.7 ఎకరాలకు సంబంధించి ఆన్‌లైన్‌లో అతని పేరు నమోదు కాలేదు. దీనిపై చెన్నయ్య కుమారుడు భాస్కర్‌ అనంతయ్యను సంప్రదించాడు. రూ.30 వేలు లంచం తీసుకొని ఆన్‌లైన్‌లో పేరు నమోదు చేశారు. 

కానీ, గత నెల 18న ఆన్‌లైన్‌లో పేరు నమోదు చేసి 24న తొలగించారు. దాంతో, భాస్కర్‌ మళ్లీ అనంతయ్యను సంప్రదించగా.. ఈసారి ఎకరాకు రూ.లక్ష చొప్పున 9 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. అంత ఇచ్చుకోలేనని భాస్కర్‌ చెప్పడంతో రూ.8 లక్షలకు ఒప్పందం కుదిరింది. దాంతో, భాస్కర్‌ ఏసీబీ అధికారులను సంప్రదించాడు. బుధవారం కొందుర్గులో భాస్కర్‌ నుంచి అనంతయ్య రూ.4 లక్షలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఇందులో రూ.5 లక్షలు కేశంపేట తహసీల్దార్‌ లావణ్యకు, రూ.3 లక్షలు తనకని వీఆర్వో అనంతయ్య పోలీసుల విచారణలో చెప్పాడు.

ఇంకేముంది వెంటనే ఆ తహశీల్దార్ విచారించగా... ఆమె తనకు ఏమీ లేదని చెప్పారు. అనుమానం వచ్చిన అధికారులు సోదాలు చేయగా... ఇంట్లో  ఎక్కడ చూసినా నగదు కట్టలే. ఆమె ఇంట్లో రూ.93లక్షల నగదు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు మూడు గంటల పాటు నిర్వహించిన సోదాల్లో రూ.93.50 లక్షల నగదు, 40 తులాల బంగారు ఆభరణాలు, విలువైన ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. వాటిని సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios