కోదండరాంపై సోషల్ మీడియాలో కవిత వైరల్ గా మారిన కోదండరాం జన్మదినోత్సవ కవిత

నేడు తెలంగాణ జెఎసి ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం జన్మదిన సందర్భాన ఒక కవిత సోషల్ మీడియాలో వైరల్ అవుుతోంది. దాన్ని ఒకసారి చూద్దాం.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఎవలు నువ్వు ? యాడినుండొచ్చినవ్ ? రాధాకృష్ణుడు పుట్టిన్నాడే నువ్వు పుట్టినవెందుకు ? ఇండ్ల మతలబేంది ?

" ఉపాధ్యాయ దినోత్సవం " నాడే పుట్టిన నువ్వు అదే పనిలకు ఎందుకు పోయినవ్ ?

సమాజానికి భావి భారత పౌరులనందించేందుకు నువ్వెందుకు కంకణం కట్టుకున్నవ్ ?

నాలుగు గోడల మధ్యల్నే గాక , నాలుగు దిక్కుల సుత పాఠాలెందుకు చెప్తున్నవ్ ?

కోదండరాం రెడ్డి గ ఉన్న నువ్వు కోదండరాం ఎందుకైనవ్ ?

వేరే కులపొళ్ళమీద ఘోరాలు జరుగుతే నువ్వెందుకు నీ కులం పేరు తీసేసుకున్నవ్ ?

నీ బిడ్డలను సుత వేరే కులపొళ్ళకెందుకిచ్చినవ్ ?

అసలు స్వరాష్ట్ర ఉద్యమంల నీ పాత్రేంది ?

అందరు పంతుళ్ళ లెక్క నీ పని నువ్వు చేస్కొని ఇంట్ల ఉండక ఈడికెందుకచ్చినవ్ ?

నీ నౌకరి బందు వెట్టి రోడ్లమీదకెందుకచ్చినవ్ ?

ఉన్నై సాలవని లంచాల కోసం అడుక్కునే సన్నాసులున్న కాలంల నువ్వెందుకు నీ జీతంల సగం సమాజానికిచ్చినవ్ ?

ఏడ వడ్తె ఆడ షామియానాలల్లెందుక్కూసున్నవ్ ?

అధికారం కోసం నీకచ్చిన అవకాశాన్నెందుకొదులుకున్నవ్ ?

AC రూములల్ల ఉండక ప్రజానికంలకెందుకచ్చినవ్ ?

అసలు నువ్వు తెలంగాణ కోసం అడుగు మోపినప్పుడు నువ్వెవలో తెల్వని సన్నాసులు , నీ కాలి గోటికి సుత సరిపోని లఫంగి గాళ్ళు నిన్నేదో అనేటట్లు నువ్వెందుకు చేస్కున్నవ్ ?

ఏదో మంత్రి పదవిల కుర్చేసుకొని కూసుంటే ఐపోవు గద ! ప్రశ్నించే గొంతుకకు ప్రశ్నావేదికవెందుకైనవ్ ?

ఒక వేములఘాట్ , ఒక గోలివాడ , ఒక నేరెల్ల ..... ఇట్ల బాధితుల పక్షానెందుకు నిలవడ్తున్నవ్ ?

ఎందుకంటె మీరు ముద్దసాని కోదండరాం రెడ్డి వి కాదు , మీరు ఆచార్య కోదండరాం సారువి కాబట్టి !

ఎందుకుంటే మీరు బాధ్యత గల పౌరుడివే కాదు , బాధ్యత గల ఉపాధ్యాయునివి కూడా కాబట్టి !

ఎందుకుంటే మీరు సిధ్ధాంత కర్త జయశంకర్ గారి అడుగులలో నడుస్తున్నరు కాబట్టి !

ఎందుకుంటే మీరు కోరుకునేది ఆర్థిక అసమానతలు లేని , సస్యశ్యామల తెలంగాణా కాబట్టి !

ఎందుకుంటే మీరు ........ మీరే కాబట్టి !!

ఏ అసమానతలు లేని , ఏ అసంతృప్తి లేని , ఏ దాడులు లేని , ఎలాంటి అరాచకాలు లేని , ఏ గడపకు ఆపద వచ్చినా మేమున్నాం అంటూ వచ్చే ఒక ఆపన్నహస్తం కోసం ఎదురు చూసే యావత్ తెలంగాణా ప్రజల తరపున నుండి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

<!-- You're using demo endpoint of Iframely API commercially. Max-width is limited to 320px. Please get your own API key at https://iframely.com. -->ఏషియానెట్-తెలుగు ఎక్స్ ప్రెస్ న్యూస్