ఖమ్మం: తమలా తమ పిల్లలు కష్టపడకూడదన్న ఆలోచనతో కడుపుతీపిని భరిస్తూ కష్టమైన ఆ తల్లిదండ్రులు పిల్లలను హాస్టల్ లో చేర్పించారు. హాస్టల్ లో చదువుకోవాల్సిన ఆ గిరిపుత్రులు సెల్ ఫోన్ కోసం గొడవ పెట్టుకున్నారు. ఓ విద్యార్థిని మరికొందరు విద్యార్థులు దాడి చేసి చంపేశారు. 

ఇంతకీ సెల్ ఫోన్ వివాదం వచ్చిందో ఏ ఇంటర్ చదువుతున్న విద్యార్థు మధ్యో డిగ్రీ చదవుతున్న వాళ్ల మధ్యో కాదు. నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థు మధ్య సెల్ ఫోన్ గొడవ వచ్చింది. ఈ గొడవే ఒక విద్యార్థి ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ ఘటన ఖమ్మం జిల్లా ప్రభుత్వ గిరిజన పాఠశాలలో చోటు చేసుకుంది.

మంగళవారం సాయంత్రం సెల్ ఫోన్ కోసం జోసఫ్ అనే విద్యార్థికి హాస్టల్ లోని మరికొందరి విద్యార్థులకు వివాదం చోటు చేసుకుంది. ఈ వివాదం పెద్దదిగా మారడంతో నాలుగో తరగతి విద్యార్థులు కొంతమంది జోసఫ్ దాడికి పాల్పడ్డారు. తోటి విద్యార్థుల చేతిలో తీవ్రంగా గాయపడ్డ జోసఫ్ అనే విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పాఠశాల సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. 

అయితే అప్పటికే జోసఫ్ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. దీంతో పోలీసులకు హాస్టల్ సిబ్బంది ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విద్యార్థుల మధ్య గొడవ జరుగుతున్న సమయంలో హాస్టల్ వార్డెన్ లేనట్లు కొందరు విద్యార్థులు చెప్తున్నారు.