నల్గొండ: నల్గొండ జిల్లాలో పనిచేసే ప్రభుత్వ ఉపాధ్యాయుడు చేసిన పని పలువురి ప్రశంసలు పొందింది. ఏకంగా ఓ జాతియ దినపత్రికలో కూడ ఆయనను గురించి ఓ ప్రత్యేక కథనం కూడ ప్రచురించారు.

నల్గొండ జిల్లాలోని అడవిదేపులపల్లి మండలంలోని  చిట్యాల గ్రామంలో జి.సతీష్ ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నాడు.ఎనిమిదేళ్ల క్రితం సతీష్ ఈ స్కూల్‌లో టీచర్‌గా చేరాడు.  ఆ సమయంలో ఆస్కూల్‌లో 21 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు.ప్రస్తుతం ఈ స్కూల్లో 63 మంది విద్యార్థులు చదువుతున్నారు.

ఈ గ్రామంలో అప్పటికే మూడు ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలోకి పిల్లలను ఎందుకు చేర్పించడం లేదనే విషయమై సతీష్ గ్రామంలోని విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చించారు.

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పిస్తే వారిని తీర్చిదిద్దుతానని సతీష్ హామీ ఇచ్చారు.దీంతో ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులను ఆకర్షించేందుకుగాను సతీష్ స్కూల్ ఆవరణలో తన స్వంత డబ్బులతో టాయిలెట్స్ ను నిర్మించాడు.  

అంతేకాదు ప్రైవేట్ పాఠశాలలో చదివిన విద్యార్థుల కంటే  ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు అన్ని విషయాల్లో ముందుంటారని సతీష్ బల్లగుద్ది చెబుతున్నారు.

ఎంఎస్సీ  మ్యాథ్స్ ‌తో పాటు బీఈడీ చేసిన సతీష్ ప్రభుత్వ పాఠశాలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాడు.  గత విద్యాసంవత్సరంలో సతీష్ తాను నివాసం ఉంటున్న గ్రామం నుండి విధులు నిర్వహిస్తున్న చిట్యాల గ్రామానికి  సతీష్ ప్రతి రోజూ 110 కి.మీ ప్రయాణం చేసేవాడు. 

ఆ తర్వాత ఆయన తన నివాసాన్ని మిర్యాలగూడకు మార్చాడు. దీంతో ప్రతి రోజూ ఆయన 82 కి.మీ ప్రయాణం చేయాల్సి వస్తోంది.కానీ, ఆయనకు ట్రావెల్ అలవెన్స్ రావడం లేదు. ఈ విషయమై ఆయన కొన్ని సమయాల్లో ఈ విషయమై కొంత ఇబ్బందిపడుతున్నాడు.  

ప్రతి రోజూ ఉదయాన్ని స్కూల్‌కు ఉదయం 9 గంటలకు చేరుకొంటాడు. సాయంత్రం నాలుగు గంటల వరకు ఆయన స్కూల్లోనే ఉంటాడు. ప్రతి రోజూ ఉదయం స్కూల్‌కు ఒక్క గంట ముందే చేరుకొంటాడు.

ఈ స్కూల్‌కు విద్యార్థులను ఆకర్షించేందుకు స్కూల్ బయట సతీష్ పెద్ద ఫ్లెక్సీని ఏర్పాటు చేశాడు. తాను స్కూల్‌కు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా, ఒక్క నిమిషం ముందుగా స్కూల్‌ను వదిలినా తన వేతనంలో ఆ రోజు జీతాన్ని తీసుకొని పాఠశాల అభివృద్ధికి ఖర్చు చేయాలని ఆయన ఆ ఫ్లెక్సీలో పెట్టాడు.

మరో వైపు  పని దినంలో రోజంతా స్కూల్‌ను మూసివేసినా కూడ ఇదే విధానం వర్తించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. గత విద్యాసంవత్సరంలో  ఆయన రెండు రోజులు మాత్రమే ఆయన స్కూల్‌కు ఆలస్యంగా వచ్చాడు.