స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా రాఖీ పండుగను పురస్కరించుకుని 75 రాఖీలను తయారుచేసి చెట్లకు కట్టింది బ్లేస్సి అనే చిన్నారి. హరితహారం కార్యక్రమంలో భాగంగా రోడ్డుకిరువైపులా నాటిన చెట్లకు, తన ఇంటి ఆవరణలో ఉన్న చెట్లకు ప్రేమతో రాఖీలు కట్టింది.  

స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా రాఖీ పండుగను పురస్కరించుకుని 75 రాఖీలను తయారుచేసి చెట్లకు కట్టింది బ్లేస్సి అనే చిన్నారి. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాల గ్రామానికి చెందిన డాక్టర్ ప్రకృతి ప్రకాష్ కూతురు బ్లేస్సికి 9 సంవత్సరాలు. ఈ పాప నాంపల్లి నిర్మల స్కూల్లో మూడో తరగతి చదువుతోంది. తన తండ్రి ప్రకృతి ప్రకాష్ ప్రకృతి ప్రేమికుడు కావడంతో తన కూతురు సైతం అదే బాటలో నడుస్తోంది. చిన్ననాటి నుండి పర్యావరణ పరిరక్షణకై తాను సైతం ముందుకు సాగుతోంది. గతంలో చెట్ల క్రింద రాలిపడ్డ 65 వేల విత్తనాలను సేకరించి విత్తనవంతులుగా చేసి తన తండ్రి సహాయంతో అడవిలో వేసింది.

బ్లేస్సి కృషిని గుర్తించిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ , మంత్రి కేటీఆర్‌లు బ్లేస్సి బర్త్ డే సందర్భంగా హైదరాబాద్ కు పిలిపించుకుని మొక్క నాటించి శాలువాతో సత్కరించారు. మంత్రి కేటీఆర్ , సంతోష్ కుమార్ ప్రోత్సాహంతో తన కుటుంబంతో కలిసి రోజుకు 800 సీడ్ బాల్స్ తయారు చేస్తోంది. టైం దొరికినప్పుడల్లా విత్తనాలను సేకరిస్తూ... కేటీఆర్ బర్త్ డే సందర్భంగా లక్ష విత్తన పంతులతో హ్యాపీ బర్త్ డే కేటీఆర్ సార్ అని తెలిపి ఆయన మన్నలను పొందింది.

ఇకపోతే.. శుక్రవారం రాఖీ పండుగ సందర్భంగా 75వ స్వాతంత్య్ర వజ్రోత్సవాలలో భాగంగా రాత్రంతా కలర్ పేపర్లతో అందంగా రాఖీలను తయారుచేసింది. అనంతరం హరితహారం కార్యక్రమంలో భాగంగా రోడ్డుకిరువైపులా నాటిన చెట్లకు, తన ఇంటి ఆవరణలో ఉన్న చెట్లకు ప్రేమతో రాఖీలు కట్టింది. బ్లేస్సి మాట్లాడుతూ రాఖీలు సోదరులకే పరిమితం కాదని సోదరులతో పాటు, మనం పుట్టినప్పటి నుంచి చెట్లు మనకు ప్రాణవాయువు ఇస్తూ కనుమూసి కాలగర్భంలో కలిసిపోయేంతవరకు కంటికి రెప్పలా కాపాడుతూనే ఉన్నాయని చెప్పింది. చెట్లే మనకు నూరేళ్ల రక్ష అని రక్షాబంధన్‌లో భాగంగా ప్రతి ఒక్కరూ చెట్లకు రాఖీలు కట్టాలని కోరింది. ఎంపీ సంతోష్ కుమార్ సార్ తలపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరింది.