Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెసు గుండెల్లో గుబులు: కేసీఆర్ టచ్ లో మరో 9 మంది ఎమ్మెల్యేలు

లోకసభ ఎన్నికల తర్వాత జరిగే శాసనసభా సమావేశాల నాటికి కాంగ్రెసుకు ప్రతిపక్ష హోదాను గల్లంతు చేయాలనే వ్యూహంతో కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నట్లు చెబుతున్నారు. శాసన మండలిలో ఇప్పటికే కాంగ్రెసు ప్రతిపక్ష హోదాను కోల్పోయింది. 

9 Congress MLAs in touch with KCR
Author
Hyderabad, First Published Mar 4, 2019, 10:11 AM IST

హైదరాబాద్: ఇద్దరు కాంగ్రెసు ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో చేరడానికి సిద్ధపడిన నేపథ్యంలో మరింత మంది ఫిరాయింపులకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. మరో 9 మంది కాంగ్రెసు శాసనసభ్యులు తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర రావుకు టచ్ లో ఉన్నట్లు చెబుతున్నారు. 

లోకసభ ఎన్నికల తర్వాత జరిగే శాసనసభా సమావేశాల నాటికి కాంగ్రెసుకు ప్రతిపక్ష హోదాను గల్లంతు చేయాలనే వ్యూహంతో కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నట్లు చెబుతున్నారు. శాసన మండలిలో ఇప్పటికే కాంగ్రెసు ప్రతిపక్ష హోదాను కోల్పోయింది. 

డిసెంబర్ లో శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కాంగ్రెసు ఎమ్మెల్సీలు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో మండలిలో కాంగ్రెసు ప్రతిపక్ష హోదాను కోల్పోయింది. ఈ స్థితిలో ఇద్దరు ఎమ్మెల్యేలతోనే ఫిరాయింపులు ఆగిపోవని అంటున్నారు. రేగా కాంతారావు, ఆత్రం సక్కు టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. 

నిరుడు డిసెంబర్ 7వ తేదీన ఫలితాలు వెలువడిన తర్వాత కేసీఆర్ ఆసక్తికరమైన ప్రకటన ఒకటి చేశారు. మహా కూటమి ఓటమితో కాంగ్రెసు ఎమ్మెల్యేలు ఆందోళనలో ఉన్నారని, వారిలో పలువురు టీఆర్ఎస్ లో చేరడానికి సిద్ధపడుతున్నారని, వారు తనను సంప్రదిస్తున్నారని కేసీఆర్ మీడియా సమావేశంలో చెప్పారు. అయితే వారి పేర్లను మాత్రం ఆయన వెల్లడించలేదు. 

ఈ నేపథ్యంలో ఉత్తర తెలంగాణ నుంచి ఐదుగురు, దక్షిణ తెలంగాణ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. టీఆర్ఎస్ లో చేరిన వెంటనే ఓ మహిళా శాసనసభ్యురాలికి మంత్రి పదవి ఇవ్వడానికి కూడా కేసీఆర్ సిద్ధపడినట్లు చెబుతున్నారు. 

కాంగ్రెసు ఉత్తర తెలంగాణ పది సీట్లను, దక్షిణ తెలంగాణలో 9 సీట్లను గెలుచుకుంది. ఆత్రం సక్కు, రేగా కాంతారావు టీఆర్ఎస్ లో చేరాలనే నిర్ణయంతో కాంగ్రెసు బలం శాసనసభలో 17కు తగ్గిపోయింది. మరో ఏడుగురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి వస్తే కాంగ్రెసు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాను కోల్పుతుంది. 

శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం తర్వాత నలుగురు కాంగ్రెసు ఎమ్మెల్సీలు ఎంఎస్ ప్రభాకర రావు, టీ సంతోష్ కుమార్, కె. దామోదర్ రెడ్డి, ఆకుల లలిత టీఆర్ఎస్ లో చేరారు. వారు డదిసెంబర్ 22వ తేదీన మండలి చైర్మన్ స్వామి గౌడ్ ను కలిసి తమను టీఆర్ఎస్ లో విలీనం చేయాలని కోరారు. ఆ మర్నాడే విలీన ప్రక్రియను ఆయన పూర్తి చేశారు. ఇటువంటి ప్రక్రియకే శాసనసభలోనూ టీఆర్ఎస్ శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios