తెలంగాణలో కరోనా కేసులు చాప కింద నీరులా వ్యాపిస్తున్నాయి. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలల విద్యార్థులపై కరోనా ప్రభావం చూపుతోంది. గత కొన్ని రోజులుగా వైరస్‌ బారినపడుతున్న వారిలో విద్యార్థులు, ఉపాధ్యాయులే ఎక్కువగా వున్నారు.

తాజాగా రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌, బోయిన్‌పల్లిలో 81 మంది విద్యార్థులకు కరోనా సోకడం కలకలం రేపింది. హయత్‌నగర్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్‌ కళాశాలలో 41 మంది కొవిడ్‌ బారినపడ్డారు.

వీరిలో 37 మంది విద్యార్థులు కాగా.. నలుగురు ఉపాధ్యాయులు. కళాశాల వసతి గృహంలో మొత్తం 400 మంది విద్యార్థులు ఉంటున్నారు. ప్రస్తుతం కరోనా వెలుగులోకి రావడంతో కాలేజీలోనే విద్యార్ధులు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి అధికారులు కోవిడ్ టెస్టులు చేస్తున్నారు. 

అటు బోయిన్‌పల్లి ప్రభుత్వ వసతి గృహంలో 40 మందికి కరోనా నిర్ధారణ అయింది. వార్డెన్‌ సహా 40 మందికి వైరస్‌ సోకినట్లు అధికారులు వెల్లడించారు. కాగా, తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.

నిన్న రాత్రి 8 గంటల వరకు 66,036 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. 364 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 3,02,724కి చేరింది. నిన్న కొవిడ్‌తో ఇద్దరు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో ప్రాణాలు వారి సంఖ్య 1666కి చేరింది.

నిన్న 189 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 2,98,451కి చేరింది. ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 2,607 ఉండగా.. వీరిలో 980 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు