హైదరాబాద్‌లో రౌడీ షీటర్ ఇలియాస్ నవాబ్ హత్య కేసులో పోలీసులు 8 మంది నిందితులను అరెస్టు చేశారు. వారిని కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ నెల 20వ తేదీన ఇలియాస్ హత్య జరిగిన సంగతి తెలిసిందే. 23వ తేదీన రాచకొండ పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. హత్యోదంతం ఇలా ఉన్నది.
హైదరాబాద్: గ్యాంగ్ వార్‌లు కొత్తవేమీ కాదు. రాజధాని నగరం హైదరాబాద్‌లో రౌడీ షీటర్లూ ఎక్కువే. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, ఇతర లావాదేవీల్లో వారికి చెడిందా.. వివాదం ముదురుతుంది. హత్యలు చేసే దాకా వెళ్తుంది. ఇటీవలే ఒక ఘటన హైదరాబాద్‌లో ఇలాంటిదే చోటుచేసుకుంది. ఈ నెల 20వ తేదీన బాలాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ రౌడీ షీటర్ హత్య కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ హత్య కేసులో పోలీసులు వేగంగా స్పందించారు. హత్యతో ప్రమేయం ఉన్న 8 మంది నిందితులను అరెస్టు చేశారు. ఏ1 నుంచి ఏ8 వరకు వరుసగా సలేహ్ బిన్ హఫీజ్ మహ్రూజ్, అబుబాకర్ బిన్ హఫీజ్, ఇస్మాయిల్ బిన్ అబ్దుల్ అజీజ్, జాఫర్ బిన్ హవాలీ, బాబర్ హందీ, షేక్ మాజిద్ అల్ హాసన్, ఇబ్రహీం మొహమ్మద్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ కేసరి, మునాసిర్ ఆమెర్ బారాసిత్‌లను ఈ నెల 23వ తేదీన రాచకొండ పోలీసులు అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచారు.
రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం షహీన్ నగర్‌కు చెందిన ఇలియాస్ నవాబ్ హత్య ఈ నెల 20న జరిగింది. ఇలియాస్ నవాబ్‌కు వాటర్ ప్లాంట్ బిజినెస్ ఉన్నది. దీనికితోడు ఆయన రియల్ ఎస్టేట్ కూడా చేశాడు. రియల్ ఎస్టేట్ విషయంలోనే గొడవలు జరిగాయి. ఈ ఘర్షణల కారణంగానే ఆయన హత్య జరిగినట్టు పోలీసులు తెలిపారు.
పోలీసులు వివరాలు ఇలా ఉన్నాయి. ఏ1 నిందితుడు సలేహ్ బిన్ హఫీజ్ మహ్రూజ్ నిర్మాణ పనుల మెటీరియల్ సప్లై చేయడంతోపాటు రియల్ ఎస్టేట్ కూడా చేస్తూ ఉంటాడు. వివాదాస్పద ప్రాంతాలనూ కొనుగోలు చేయడం, అమ్మడం వంటివి చేస్తుంటాడు. ఈయనతో హత్యకు గురికాబడ్డ ఇలియాస్ 2019లో కలిశాడు. వీరిద్దరూ పార్ట్‌నర్షిప్‌లో రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు చేశారు. అయితే, ఒకసారి ఇలియాస్ నవాబ్.. పార్ట్‌నర్ ఏ1కు తెలియకుండా ఓ సైట్‌ను ఇతరులకు అమ్మేశాడు. ఈ సైట్ అమ్మకం ఇద్దరి మధ్య వివాదానికి దారి తీసింది. కానీ, పెద్దల దగ్గర వీరి మధ్య శాంతియుతంగానే రాజీ కుదిరింది.
కానీ, అప్పటి నుంచి ఇద్దరి మధ్య సత్సంబంధాలు లేకుండా పోయాయి. ఆ దూరం మరింత పెరుగుతూ ఆగ్రహావేశాలూ పెరిగిపోయాయి. ఇలియాస్ తరుచూ ఏ1కు ఫోన్ చేసి బెదిరిస్తూ మాట్లాడుతుండేవాడు. ఇటీవలే చంద్రయాణగుట్టలో ఓ ఓపెన్ ప్లాట్‌ను ఇలియాస్ ఆక్రమించుకుని చుట్టూ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశాడు. కొందరు ఆ కెమెరాలను దొంగిలించారు. ఆ చోరీ వెనుక ఏ1 ఉన్నాడని ఇలియాస్ భావించి బెదిరిస్తూ ఫోన్ చేశాడు. ఏ1 సలేహ్ బిన్ హఫీజ్ మహ్రూజ్‌ను చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఇలియాస్‌నే చంపేసేయాలని ఏ1 నిశ్చయించుకున్నాడు. సరైన సమయం కోసం ఎదురుచూశాడు.
ఇంతలో ఏ7 ఇబ్రహీం మొహమ్మద్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ కేసరి బర్త్ డే పార్టీ ఈ నెల 20న చేసుకున్నారు. సాయంత్రం 6 గంటలకు ఏ1 నుంచి ఏ8 నిందితులు అందరూ అల్ జబ్రీ కాలనీలోని ఏ1 ఫామ్ హౌజ్‌లో కలిశారు. ఈ పార్టీ జరుగుతుండగా ఏ1 ఫ్రెండ్ జకారియా హుస్సేన్ బోమ్(ఈయన మృతుడికి, ఏ1కు కామన్ ఫ్రెండ్) అమ్మకానికి సిద్ధంగా ఉన్న ఓ ఇంటిని కొనుగోలు చేయడానికి షహీన్‌నగర్‌కు వచ్చాడు. జకారియా, ఏ1 ఇద్దరూ అక్కడికి బైక్‌పై వెళ్లారు. తిరిగి వస్తుండగా ఇలియాస్ ఇంటి ముందు నుంచే వెళ్లారు. ఈ విషయం ఆ తర్వాత ఇలియాస్‌కు తెలిసింది.
అప్పుడు జకారియాకు ఇలియాస్ ఫోన్ చేసి ఏ1ను, ఏ1 కుటుంబాన్ని అసభ్యంగా దూషించాడు. ఆ ఫోన్ లౌడ్‌స్పీకర్ పెట్టి ఉండటంతో ఏ1 మరిగిపోయాడు. ఆ ఫోన్ చేతిలోకి తీసుకుని ఇలియాస్‌ను తిరిగి దూషించాడు. ఆ వాగ్వాదం పరాకాష్టకు చేరింది. ఆ తర్వాత ఇద్దరూ ఒకరిని ఒకరు చంపేస్తామని బెదిరించుకున్నారు. అప్పుడే ఇలియాస్‌ను చంపేయాలని ఏ1 భావించాడు. బర్త్ డే పార్టీలోని వారిని అందుకు సహకరించాల్సిందిగా కోరాడు.
కొన్ని నిమిషాల్లోనే వారు అక్కడి నుంచి బయల్దేరి ఇలియాస్ ఇంటికి కొంత దూరంలో నిర్మానుష్య ప్రాంతంలో మాటు వేసి ఉన్నారు. వాటర్ ప్లాంట్ దగ్గర రోజూ బయల్దేరినట్టుగానే ఇలియాస్ కారులో బయల్దేరాడు. ఆ కారు సమీపించగానే ఈ 8 మంది నిందితులు కారును అడ్డగించి కర్రలు, కత్తులతో దాడి చేశారు. కారు నుంచి కత్తి తీసి ఇలియాస్ కూడా ఎదురుదాడి చేశాడు. ఏ1 ఉన్నట్టు గుర్తించిన ఇలియాస్ మొదలు ఆయనపై కత్తితో దాడి చేయగా తృటిలో తప్పించుకున్నడు. మరొకరి కాలుపై వేటు వేశాడు. ఆ వెంటనే ఏ1 ఇలియాస్ చేతిని పట్టుకుని కత్తి లాగేశాడు. ఆ తర్వాత అందరూ కలిసి ఇలియాస్‌ను తీవ్రంగా కొట్టేసి అక్కడి నుంచి బైక్‌లపై వెళ్లిపోయారు.
ఆ తర్వాత ఇలియాస్ తన మిత్రుడు జకారియాకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. జకారియా వెంటనే ఇలియాస్‌ను ఒవైసీ హాస్పిటల్ తరలించాడు. కానీ, అప్పటికే మరణించాడని వైద్యులు చెప్పారు.
పోలీసులు హత్య చేసిన 8 మంది నిందితులను అరెస్టు చేశారు. ఇతరుల ప్రమేయాన్నీ పరిశీలిస్తున్నారు.
