కరీంనగర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వృద్ధాశ్రమంలో ఒంటరితనం భరించలేక ఓ వృద్ధుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. జమ్మికుంట మండలం కోరపల్లి పంచాయతీ పరిధిలోని కాపులపల్లి గ్రామానికి చెందిన పోరెడ్డి అంకిరెడ్డి (77).

ఆయన యువకుడిగా వున్నప్పుడే భార్యాభర్తల మధ్య తగాదాతో విడిపోయారు. అప్పటి నుంచి ఒంటరి జీవితాన్నే గడుపుతున్నాడు. గ్రామంలో తన సోదరి కుమారులతో కలిసి వుండేవాడు.

ఇంటివద్ద తనను సరిగా పట్టించుకునేవాళ్లు లేకపోవడంతో అల్లుళ్ల సాయంతో కరీంనగర్‌లోని ఓ వృద్ధాశ్రమంలో కొన్నాళ్లు ఉన్నాడు. అనంతరం ఇల్లందకుంటలోని రామసాయి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన వృద్ధాశ్రమంలో 2017 నుంచి ఉంటున్నాడు.

Also Read:హైద్రాబాద్‌లో విషాదం: కరోనాతో ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి

ఈ క్రమంలో అక్కడ ఇటీవల ముగ్గురికి కరోనా సోకింది. దీంతో వృద్ధుల బంధువులకు నిర్వాహకులు సమాచారం అందించారు. అయితే అంకిరెడ్డితో కొన్నేళ్లుగా ఉంటున్నవారు ఇంటికి వెళ్లిపోయారు.

తన మిత్రులు ఎవరూ పక్కనే లేకపోవడంతో అంకిరెడ్డి ఒంటరితనం భరించలేకపోయాడు. మనస్తాపం చెందిన ఆయన సోమవారం రాత్రి ఆశ్రమంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

అయితే ఈ ఘటనకు ఆశ్రమ నిర్వాహకులే కారణమని పలువురు ఆందోళనకు దిగారు. దీనిపై స్పందించిన ట్రస్ట్ నిర్వాహకులు.. ఆశ్రమంలో కొందరికి కరోనా రావడంతో అందరి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చినట్లు చెప్పారు.

కానీ అంకిరెడ్డి సంబంధీకులు ఎవరూ రాలేదని, పైగా అతనిని ఆశ్రమంలోనే ఉంచుకోవాలని తమతో చెప్పినట్లుగా పేర్కొన్నారు. కాగా ఆశ్రమంలో కరోనా కేసులు నమోదు కావడంతో అధికారులు పరిశీలనకు వచ్చారు. పరిస్ధితి తీవ్రత దృష్ట్యా వృద్ధులందరినీ ఇంటికి పంపిస్తున్నామని నిర్వాహకులు  చెప్పారు.

Also Read:రంగారెడ్డిలో పెరుగుతున్న కరోనా: తెలంగాణలో 58 వేలు దాటిన కేసులు

అయితే ఇంటికి వెళ్తే తనను పట్టించుకునేవారు ఎవరూ లేరని, దీని కంటే తనకు చావే శరణ్యమని అంకిరెడ్డి విలపించాడు. తాను చెప్పినట్లుగానే సదరు వృద్ధుడు ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలచివేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.