హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతి మున్సిపాలిటీలో పౌరుల సదుపాయాల కోసం అన్ని రకాల చర్యలు తీసుకొంటున్నట్టుగా తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. హైద్రాబాద్ లో ఇప్పటికే చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలతో పాటు మరిన్ని కార్యక్రమాలను నిర్వహిస్తామని ఆయన తెలిపారు. 

బుధవారం నాడు తెలంగాణ అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు.కరోనా సంక్షోభంతో రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ దెబ్బతిన్నట్టుగా చెప్పారు.కరోనా కారణంగా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో ఎక్కడా కూడ అభివృద్ది కార్యక్రమాలు నిలిచిపోలేదన్నారు. 

రాబోయే ప్రతి ఆర్నెళ్లలో ప్రతి మున్సిపాలిటీలో వెజ్, నాన్ వెజ్ మార్కెట్లను ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో డంపింగ్ యార్డు లేని మున్సిపాలిటీ లేదని ఆయన చెప్పారు.ప్రతి మున్సిపాలిటీలో శానిటేషన్ పై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించినట్టుగా ఆయన చెప్పారు. పట్టణాల్లో మొక్కల పెంపకం కోసం గ్రీన్ బడ్జెట్ ను అమలు చేస్తున్నామన్నారు.

వరంగల్ లో మెట్రో నియో ప్రాజెక్టుకు రూ. 150 కోట్లు మంజూరు చేశామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో భవన నిర్మాణ అనుమతుల కోసం టీఎస్ బీ పాస్ చట్టం తీసుకొచ్చినట్టుగా ఆయన చెప్పారు.ఖమ్మం కార్పోరేషన్ కు రూ, 150 కోట్ల ప్రత్యేక నిధులు ఇచ్చినట్టుగా ఆయన తెలిపారు.ఆరేళ్లలో 67 వేల కోట్లను మున్సిపాలిటీల అభివృద్ది కోసం ఖర్చు చేసినట్టుగా మంత్రి వివరించారు.