హైదరాబాద్‌లో అత్యంత రద్దీగా ఉండే బంజారాహిల్స్‌ రోడ్డు నెంబర్ 2లో గోనె సంచిలో శవం కలకలం రేపింది. ఫుట్‌పాత్‌పై అనుమానాస్పదంగా కనిపించిన గోనెసంచిలో మృతదేహం వున్నట్లుగా అనుమానం రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కోవిడ్ కారణంగా అన్ని జాగ్రత్తలు  తీసుకుని గోనెసంచిని తెరిచారు. సదరు సంచిలో 60 ఏళ్ల వయసున్న మహిళ మృతదేహం వుంది.

శరీరంపై ఏమైనా గాయాలున్నా అనే కోణంలో పోలీసులు పరిశీలిస్తున్నారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించడం ద్వారా మృతదేహాన్ని ఎవరు తెచ్చి పడేశారన్న దానిపై ఆరా తీస్తున్నారు.

కాగా మహిళ ఎవరనేది తెలియాల్సి వుందని, పోస్ట్‌మార్టం ద్వారా మరిన్ని వివరాలు తెలిసే అవకాశం వుంది. అయితే ఆమెను హత్య చేసి ఇక్కడ పడేశారా..? మరేదైనా కారణముందా..? అనేది తెలియాల్సి వుంది.