కుటుంబానికి భారంగా మారిందని ఆరేళ్ల పాపను అత్యంత కిరాతకంగా హత్య చేసింది ఆమె సొంత చిన్నమ్మ. వివరాల్లోకి వెళితే... దమ్మాయిగూడకు చెందిన లక్ష్మీప్రసన్న భర్త మరణించడంతో కూతురు జ్ఞానేశ్వరితో కలిసి ఉంటోంది.

అయితే నాలుగు నెలల క్రితం లక్ష్మీ కూడా మరణించడంతో చిన్నారి అనాథగా మారింది. ఈ క్రమంలో ఆమె అమ్మమ్మ పెంటమ్మ, చిన్నమ్మ కృష్ణకుమారి చిన్నారి బాగోగులు చూస్తున్నారు.

పెంటమ్మ స్టేట్ బ్యాంక్ రిటైర్డ్ ఉద్యోగి... కృష్ణకుమారి భర్తకు దూరంగా తొమ్మిదేళ్ల కొడుకుతో ఉంటోంది. ఆమెకు గతంలోనే సరూర్‌నగర్‌కు చెందిన శివారెడ్డి అనే వ్యక్తితో పరిచయమైంది.

కృష్ణకుమారి ఇంటికి అతను తరచుగా వస్తూ పోతూ ఉండేవాడు. అయితే పెంటమ్మకు వచ్చే పింఛన్ డబ్బుతో ఇళ్లు గడవటం భారంగా మారింది. ఈ క్రమంలో అక్క కూతురును వదిలించుకుంటే ఈ కష్టాలు తగ్గుతాయని భావించిన కృష్ణకుమారి.. స్నేహితుడు శివారెడ్డితో కలిసి పాపను చంపాలని కుట్ర పన్నింది.

ఈ నెల 22న పెంటమ్మ తన పింఛన్ డబ్బులు తెచ్చుకునేందుకు బయటకు వెళ్లింది. కృష్ణకుమారి కూడా తన కొడుకుని ఆడుకోమని బయటకు పంపించింది. అనంతరం జ్ఞానేశ్వరిని బెడ్‌రూమ్‌లోకి తీసుకెళ్లి శివారెడ్డితో కలిసి చిన్నారి తలను గోడకేసి కొట్టింది.

దీంతో తీవ్ర రక్తస్రావంతో పాప కిందపడి గిలగిలా కొట్టుకుంటోంది. అయినప్పటికీ ఏమాత్రం కనికరం లేకుండా ఇద్దరు కలిసి ఊపిరాడకుండా హత్య చేశారు. పని ముగించుకుని ఇంటికి వచ్చిన పెంటమ్మకు పాపకి ఉన్నట్లుండి ఫిట్స్ వచ్చి కిందపడిపోయిందని చెప్పారు.

ఆస్పత్రికి తీసుకెళుతున్నామంటూ ఇద్దరు కలిసి ఆటోలో బయలుదేరి మార్గమధ్యంలోనే జ్ఞానేశ్వరి చనిపోయిందంటూ మళ్లీ  ఇంటికి తెచ్చారు. పాప మృతదేహాన్ని ఖననం చేసేందుకు బంధువులు కుషాయిగూడ శ్మశానవాటిక వద్దకు తీసుకెళ్లారు.

అయితే పాప ఒంటిపై గాయాలు వారికి అనుమానం కలిగించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న మల్కాజ్‌గిరి పోలీసులు అదే రోజున కృష్ణకుమారి, శివారెడ్డిని అరెస్ట్ చేశారు.