Asianet News TeluguAsianet News Telugu

ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్‌లో 51 శాతం మంది ఫెయిల్.. అందుకేనా ?

ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు ఈ సారి మరీ దారుణంగా వచ్చాయి. పరీక్ష రాసిన స్టూడెంట్లలో 51 శాతం మంది ఫెయిల్ అయ్యారు. కరోనా లాక్ డౌడ్, ఆన్ లైన్ క్లాసుల వల్ల చాలా మంది స్టూడెంట్లు పరీక్షలు సరిగా రాయలేకపోయారు. దాని ప్రభావమే ఫలితాలపై కనిపించింది. 

51 percent in Inter first year exam results Many people fail .. Is that so?
Author
Hyderabad, First Published Dec 17, 2021, 10:17 AM IST

ఇంట‌ర్ మొదటి సంవ‌త్స‌రం ప‌రీక్షా ఫ‌లితాలు గురువారం మధ్యాహ్నం విడుద‌ల‌య్యాయి. ఇందులో ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా పాస్ ప‌ర్సెంటేజ్ వ‌చ్చింది. స‌గం కంటే ఎక్కువ మంది ఫెయిల్ అవడం ఆందోళ‌న క‌లిగించే విష‌యం. ప్ర‌తీ స్టూడెంట్ జీవితంలో ఇంట‌ర్ చ‌దువు అనేది చాలా కీలకం. మెడిసిన్‌, ఇంజ‌నీరింగ్ సీట్ల‌ను భ‌ర్తీ చేసే క్ర‌మంలో ఇంట‌ర్ మార్కుల‌కు వెయిటేజీ ఇస్తారు. ఈ సారి ప‌రీక్ష‌ల్లో కేవలం 49 శాతం మంది స్టూడెంట్లు పాస్ అయ్యార‌ని ఇంట‌ర్ బోర్డు తెలిపింది. ఇందులో ఈ సారి ఏ ఒక్క‌రూ కూడా 100 శాతం మార్కులు సాధించ‌లేదు. చాలా మంది బార్డ‌ర్ మార్కుల‌పై పాస్ అయ్యారు. 

4,59,242 మంది ప‌రీక్ష రాస్తే 2,24,012 మందే పాస్..
ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్ స్టూడెంట్ల‌కు ఈ ఏడాది అక్టోబ‌ర్ 25 నుంచి న‌వంబ‌ర్ 2వ తేదీ వ‌ర‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఈ ప‌రీక్ష‌ల‌కు 4,59,242 మంది స్టూడెంట్లు హాజ‌ర‌వ‌గా.. 2,24,012 మంది పాస్ అయ్యారు. ఇందులో సగం కంటే ఎక్కువ అంటే 2,35,230 మంది ఫెయిల్ అయ్యారు. గ‌డిచిన కొన్నేళ్ల‌ల్లో ఇంత త‌క్కువ పాస్ ప‌ర్సంటేజ్ ఎప్పుడూ రాలేదు. గ‌తేడాది కంటే ఈ సారి 11 శాతం మంది స్టూడెంట్లు ఫెయిల్ అవ‌డం కొంత ఆందోళ‌న చెందాల్సిన అంశంమే. వీరికి స‌ప్ల‌మెంట‌రీ ప‌రీక్ష‌లు నిర్వ‌హించే అవ‌కాశం కూడా ఉన్న‌ట్టు క‌నిపించ‌డం లేదు. ఈ విష‌యంలో ఇంట‌ర్ బోర్డు ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయలేదు. ఇందులో ఫెయిల్ అయిన విద్యార్థులు డైరెక్ట్‌గా మార్చి లేదా ఏప్రిల్‌లో నిర్వహించే యాన్యువ‌ల్ ప‌రీక్ష‌ల స‌మ‌యంలోనే రాయాల్సి ఉంటుంది. ఈ స్టూడెంట్లు ఇప్ప‌టికే రెండో సంవ‌త్స‌రం చ‌దువుతున్నారు కాబ‌ట్టి.. ఇటు సెకండియ‌ర్ ప‌రీక్ష‌లు, అటు ఫ‌స్టియ‌ర్ ఫెయిల్ అయిన స‌బ్జెక్టుల‌కు ప‌రీక్ష‌లు రాయాల్సి ఉంటుంది.

ఎందుకు త‌గ్గింది ? 
ఇంట‌ర్ ఫ‌లితాల‌ను చూసి స్టూడెంట్ల త‌ల్లిదండ్రులు, విద్యావేత్త‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. గ‌డిచిన కొన్నేళ్ల‌లో ఇలాంటి ఫ‌లితాలను ఎక్క‌డా చూడ‌లేద‌ని చెప్తున్నారు. ఈ సారి ఉత్తీర్ణ‌త శాతం త‌గ్గ‌డానికి కార‌ణాలేంట‌ని విశ్లేషిస్తే ఎన్నో విష‌యాలు బ‌య‌ట‌ప‌డుతాయి. ఇప్పుడు ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్ ప‌రీక్ష‌లు రాసిన విద్యార్థులు మొద‌టి నుంచీ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ బ్యాచ్ స్టూడెంట్లు ప‌దో త‌ర‌గ‌తి చ‌దువుతున్న స‌మ‌యంలోనే ఇండియాలోకి క‌రోనా వైర‌స్ ప్ర‌వేశించింది. బోర్డు ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్న స‌మ‌యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ పెట్టారు. దీంతో వీరి ప‌రీక్ష‌లు వాయిదా వేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అయితే మ‌ళ్లీ ప‌రీక్షలు నిర్వ‌హించే అవ‌కాశం లేక‌పోవ‌డంతో వీరిని డైరెక్ట్‌గా ప్ర‌మోట్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. స్కూల్‌లో నిర్వ‌హించిన ఇంట‌ర్న‌ల్ ప‌రీక్ష‌ల మార్కుల ఆధారంగా వీరికి మార్కులు కేటాయించారు. అయితే వీరు ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్‌లోకి అడ్మిష‌న్ తీసుకున్న చాలా రోజుల వ‌ర‌కు కూడా క‌రోనా వ‌ల్ల క్లాసులు నిర్వ‌హించ‌లేదు. చివ‌రికి లాక్ డౌన్ ఎత్తేసి ప‌రిస్థితులు కొంత స‌ద్దుమ‌ణిగాక‌.. వీరిని కాలేజ్‌కి పిలిచి క్లాసులు చెప్పారు. 
కొంత కాలం త‌రువాతే భార‌త్ లోకి సెకెండ్ వేవ్ ప్ర‌వేశించ‌డంతో మ‌ళ్లీ విద్యాసంస్థ‌ల‌న్నీ మూసివేస్తున్నామ‌ని తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఆన్‌లైన్ క్లాసులు ద్వారా చ‌దువు కొన‌సాగించాల‌ని స్టూడెంట్ల‌కు, కాలేజీ మేనేజ్‌మెంట్ల‌కు సూచించింది. చాలా మంది స్టూడెంట్ల వ‌ద్ద స‌రైన సెల్‌ఫోన్లు, ఇంట‌ర్నెట్ సౌక‌ర్యం లేక‌పోవ‌డంతో వారి చ‌దువు అంతంత మాత్రంగానే సాగింది. అయితే వీరికి  మార్చిలో ప‌రీక్ష‌లు నిర్వ‌హించే అవ‌కాశం లేక‌పోవ‌డంతో ఫ‌స్టియ‌ర్ నుంచి సెకెండియ‌ర్‌కు ప్ర‌మోట్ చేశారు. మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ్డాక వీరిని కాలేజ్ కి పిలిచి ఇటీవ‌లే సెకండియ‌ర్ పాఠాలు బోధిస్తున్నారు. అయితే వీరి భ‌విష్య‌త్తును దృష్టిలో ఉంచుకొని ఇంట‌ర్ బోర్డు వీరికి అక్టోబ‌ర్ లో ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించింది. అంతంత మాత్రం చ‌దివిన నాలెడ్జ్‌తో చాలా మంది స్టూడెంట్లు ప‌రీక్ష‌లు రాశారు. దీంతో చాలా మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. అందుకే ఉత్తీర్ణ‌తా శాతం మరీ ఇంత దారుణంగా వ‌చ్చింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios