హైదరాబాద్ ఫలక్‌నూమాలో విషాదం చోటు చేసుకుంది. వరద ఉద్ధృతికి కొట్టుకుపోయిన నలుగురూ మరణించారు. ఈ ప్రమాదంలో కొట్టుకుపోయిన ఐదుగురిలో ఒకరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.

సుమారు 5 కిలోమీటర్ల దూరంలో నలుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. 3 కిలోమీటర్లు కొట్టుకుపోయిన తహేర్ అనే వ్యక్తి చెట్టును పట్టుకుని బతికిపోయాడు. మైలార్‌దేవ్‌పల్లి నుంచి ఫలక్‌నుమా వరకు కొట్టుకొచ్చానని అతను తెలిపాడు.

చెట్టును పట్టుకుని ప్రాణాలు రక్షించుకున్నానని వెల్లడించాడు. కాగా వర్షాలకు మైలార్‌దేవుపల్లి పల్లె చెరువు నిండి అలుగు పారింది. కట్టపై నుంచి నీరు ప్రవహించింది. అలీనగర్‌లోని పలు నివాసాలలోకి వరద నీరు వచ్చి చేరింది.

అలీనగర్‌ ప్రాంతానికి చెందిన తొమ్మిది మంది అందులో కొట్టుకుపోయారు. వారిలో దరాబ్‌ షా (35), తబస్సుమ్‌ (33) మృతదేహాలను ఫలక్‌నుమా అల్‌ జుబైల్‌ కాలనీ వద్ద ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బలగాలు గుర్తించాయి.