మహబూబాబాద్ జిల్లా కే.సముద్రంలో కారు అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లిన ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. మృతులను లలిత, సురేష్, అశాలి, భద్రుగా గుర్తించారు.
మహబూబాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. శుక్రవారం కే.సముద్రంలో కారు అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లిన ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లికి చెందిన ఐదుగురు వరంగల్ జిల్లా అన్నారం షరీఫ్ వచ్చి తిరిగి వెళ్తున్నారు. ఇదే సమయంలో మహబూబాబాద్‌కు చెందిన మరో ఇద్దరు బంధువులను కూడా తమ కారులో ఎక్కించుకున్నారు. ఈ క్రమంలో కే.సముద్రం బైపాస్ వద్ద రోడ్డు మలుపులో కారు అదుపు తప్పి వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్, మరో ఇద్దరు కారులోంచి బయటకు దూకి సురక్షితంగా బయటపడ్డారు. మిగిలిన నలుగురు కారుతో సహా బావిలో పడిపోయారు.
ALso REad:-కరీంనగర్ : పొలం దున్నుతూ అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్.. రైతు గల్లంతు
వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఇద్దరు మహిళలను వెలికి తీయగా.. అప్పటికే ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరొకరిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని జేసీబీ సాయంతో కారును బయటకు తీయగా.. లోపల చిక్కున్న ఇద్దరి మృతదేహాలు బయటపడ్డాయి. మృతులను లలిత, సురేష్, అశాలి, భద్రుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
