కారు బోల్తాపడి.. ముగ్గురు దుర్మరణం చెందిన సంఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది.  పూర్తి వివరాల్లోకి వెళితే.. మహబూబ్ నగర్ జిల్లా మాగూరు మండలం నల్లగట్టు వద్ద సోమవారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

ముగ్గరు యువకులు కారులో వస్తుండగా.. వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తు అదుపుతప్పి.. బోల్తా పడింది. మృతులు విశాఖట్టణానికి చెందిన అవినాష్(26), అనిల్(26), అరవింద్(27)గా గుర్తించారు. వీరంతా కర్ణాటక నుంచి విశాఖకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. మృతుల కుటుంబీకులకు సమాచారం అందించామని పోలీసులు తెలిపారు.

మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.