తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. రోహిణి ఎంట్రీ ఇవ్వడంతో భానుడు నిప్పులు కక్కుతున్నాడు. వడగాల్పులు, ఉక్కపోతతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటే జనం జంకుతున్నారు. వేడి దెబ్బకు రాష్ట్రం అగ్నిగుండంగా మారింది.

అర్ధరాత్రి 12 గంటలైనా వాతావరణం చల్లబడటం లేదు. రాజస్థాన్‌లోని థార్ ఎడారిని మించి హైదరాబాద్‌లో ఎండలు కాస్తున్నాయి. మే 26న థార్‌లో 43.3 డిగ్రీలు కాగా, హైదరాబాద్‌లో అంతకంటే ఎక్కువగా ఉష్ణోగ్రత నమోదైంది.

మరోవైపు ఎండ వేడిమి తట్టుకోలేక జనం పిట్లల్లా రాలిపోతున్నారు. సోమవారం ఒక్క రోజే వడదెబ్బకు 37 మంది ప్రాణాలు కోల్పోయారు.

సూర్యాపేట జిల్లాలో ముగ్గురు, యాదాద్రి భువనగిరి జిల్లాలో నలుగురు, నల్లగొండ జిల్లాలో ముగ్గురు, కరీంనగర్‌ జిల్లాలో ముగ్గురు, సిరిసిల్ల, కుమరంభీం జిల్లాల్లో ఒకరు, పెద్దపల్లి జిల్లాలో ఐదుగురు, భద్రాద్రి జిల్లాలో ఐదుగురు, ఖమ్మం జిల్లాలో ముగ్గురు, జనగామ జిల్లాలో ముగ్గురు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో ఇద్దరు, ములుగు జిల్లాలో ఇద్దరు, నాగర్‌కర్నూలు, రంగారెడ్డి జిల్లాల్లో ఇద్దరు వడదెబ్బతో అస్వస్థతకు గురై చనిపోయారు.

కాగా ఈ నెలాఖరు వరకు రాష్ట్రంలో ఇదే రకమైన పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.