లిఫ్ట్ అడిగి కారు ఎక్కిన పాపానికి ఓ వ్యక్తి నిలువు దోపిడీ సమర్పించుకోవాల్సి వచ్చింది. ఏటీఎం కార్డు లాక్కొని.. రూ.46వేల నగదు లాక్కొన్నారు. ఈ సంఘటన షాద్ నగర్ లో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్ కి చెందిన జయకిరణ్ యాదవ్ షాద్ నగర్ లో ఉంటూ కొందుర్గు శివారులోని ఓ టెక్స్ టైల్స్ లో పనిచేస్తున్నాడు. జూన్ 30న రాత్రి 8గంటలకు విధులు ముగించుకోని షాద్ నగర్ వెళ్లేందుకు రోడ్డుపై నిలబడి ఉన్నాడు. కొందుర్గు వైపు నుంచి షాద్ నగర్ వెళ్తున్న ఓ కారును లిఫ్ట్ అడిగి ఎక్కాడు. 

డ్రైవర్ శివకుమార్, అందులో ఉన్న మరో ఇద్దరు రమేష్, రాజు అలియాస్ రూప్లా కారులోనే జయ కిరణ్ ను బెదిరించి ఏటీఎం కార్డు తీసుకొని పాస్ వర్డ్ తెలుసుకున్నారు. అనంతరం షాబాద్ శివారులో బాధితుడి వదిలేసి వెళ్లిపోయారు. షాద్ నగర్ లోని హెచ్ పీ పెట్రోల్ బంకు వద్ద రూ.20వేలు, నందిగామ పెట్రోల్ బంకు వద్ద రో రూ.26వేలు ఫోన్ పే ద్వారా చెల్లించారు.

జయకిరణ్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు గురువారం నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.35వేలు స్వాధీనం చేసుకున్నారు. కాగా.. నిందితులపై గతంలోనూ పలు కేసులు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు.