తెలంగాణ రాష్ట్రంలోని  కొన్ని ప్రాంతాల్లో 30, 40ఏళ్ల తర్వాత పులి జాడలు కనిపిస్తున్నాయి. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, కవ్వాల్ టైగర్ రిజర్వ్  ప్రాంతాల్లోనే కాక కొత్తగా ఏటూరునాగారం, పెద్దపల్లి వంటి చోట పులుల పాదముద్రలు లభించాయి.

30ఏళ్ల కిందట ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల నుంచి పలులు కనిపించకుండా పోయాయి. కాగా.. ఇటీవల ఏటూరునాగారం అటవీ ప్రాంతంలో వీటి కదలికలు మళ్లీ కనపడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. రామగుండం ఎన్టీపీసీ పవర్‌ ప్రాజెక్ట్‌ సమీపంలో మరో పులి కనిపించింది. 

ఏటూరునాగారంలో కనిపించిన పులే జయశంకర్‌ భూ పాలపల్లి జిల్లాకు చేరుకుని తాడిచెర్ల, మహాముత్తారం ప్రాంతాలతో పాటు పెద్దపల్లి జిల్లాలోనూ సంచరించినట్టు అటవీ అధికారు లు నిర్ధారించారు. కిన్నెరసాని, పాకాల ఇతర అటవీ ప్రాంతాల్లో ప్రస్తుత పరిస్థితులు పులులు స్థిరనివాసం ఏర్పర్చుకునేందుకు అనుకూలంగా ఉన్నాయని అంటున్నారు.

కాగా..దేశవ్యాప్తంగా 54 పులుల అభయారణ్యాలు ఉండగా, వాటిలో 2 వేల చ.కి.మీ పైబడి అటవీ వైశాల్యమున్న నాలుగైదు అభయారణ్యాల్లో 3 ఏపీ, తెలంగాణల్లోనే ఉన్నాయి. ఏపీలోని నాగార్జునసాగర్‌ శ్రీశైలం టైగర్‌ రిజర్వ్‌ (ఎన్‌ఎస్‌టీఆర్‌) 3,728 చ.కి.మీలలో విస్తరించగా, 60 పులులున్నట్టు ఇటీవలి వెల్లడైంది. తెలంగాణలోని ఏటీఆర్‌ 2,611 చ.కి. మీలుగా విస్తరించి ఉండగా 20 పులులు, 2,016 చ.కి.మీ విస్తీర్ణం గల కేటీఆర్‌ పరిధిలో 12 వరకు పులులున్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని 3 టైగర్‌ రిజర్వులు నదుల ఒడ్డునే ఉండడంతో పాటు ఈ అడవుల్లోంచే అత్యధిక వాటా నీరు నదుల్లోకి చేరుతోంది. తెలుగు రాష్ట్రాల భవిష్యత్‌ పర్యావరణపరంగా సురక్షితంగా ఉండాలంటే అభయారణ్యాల్లోని పులులను పరిరక్షించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పులుల ఆవాసాల ద్వారా పర్యావరణపరంగా అందుబాటులోకి వచ్చే సేవలను (ఎకోలాజికల్‌ సర్వీసెస్‌) డబ్బు విలువపరంగా లెక్కిస్తే ఒక్కో పులి రూ.250 కోట్లని అంచనా.