నాగర్ కర్నూల్ లో వాగులో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు: 30 మంది ప్రయాణీకులు సురక్షితం
నాగర్ కర్నూల్ జిల్లాలోని రఘుపతిపేటలోని ఆర్టీసీ బస్సు వరద నీటిలో చిక్కుకుంది. బస్సులోని ప్రయాణీకులను జేసీబీ సహాయంతో బయటకు తీసుకు వచ్చారు.
నాగర్ కర్నూల్: జిల్లాలోని రఘుపతిపేట వద్ద మంగళవారం నాడు వాగులో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. ఈ సమయంలో వాగులో వరద పోటెత్తింది. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు , స్థానికులు జేసీబీ సహాయంతో ఆర్టీసీ బస్సులో ఉన్న ప్రయాణీకులను సురక్షితంగా బయటకు తీసుకు వచ్చారు వాగులో ఆర్టీసీ బస్సు చిక్కుకున్న సమయంలో బస్సులో 30 మంది ప్రయాణీకులున్నారు. జేసీబీ సహాయంతో బస్సులోని ప్రయాణీకులను వాగు దాటించారు.
సోమవారం నాడు కురిసిన వర్షంతో రఘుపతిపేట వద్ద వాగులో వరద నీరు పోటెత్తింది. అయితే వాగులో వరద నీటిని అంచనా వేయలేకపోయిన డ్రైవర్ బస్సును వాగును దాటించే ప్రయత్నం చేశారు. అయితే వాగు మధ్యలోకి వెళ్లేసరికి బస్సు వరద నీటిలో చిక్కుకుపోయింది. దీంతో బస్సులోని ప్రయాణీకులు ఆందోళన చెందారు. జేసీబీ రంగంలోకి దిగి ప్రయాణీకులను వాగును దాటించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.