వేడి వేడి సాంబారు గిన్నెలో పడి మూడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర సంఘటన రంగారెడ్డి జిల్లా షాబాద్ పోలీస్ స్టేషన్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లా టేక్మాల్ మండలం శేరిపల్లికి చెందిన సురేష్ బతుకుదెరువు కోసం 8నెలల క్రితం  షాబాద్ మండలం సర్దార్ నగర్ వెళ్లి అక్కడే నివాసం ఉంటున్నారు. అతనికి భార్య మూడేళ్ల కుమారుడు ఉన్నారు.

కాగా.. ఈ నెల 18వ తేదీన అదే గ్రామంలోని వారి బంధువుల ఇంటికి సురేష్ కుటుంబసమేతంగా వెళ్లాడు. అక్కడ శుభకార్యం ఉండటంతో.. ఓ పక్కన భోజనాలు తయారు చేస్తున్నారు. ఈ క్రమంలో సురేష్ మూడేళ్ల కుమారుడు ఆరుష్.. ఆడుకుంటూ వంట గదివైపు వెళ్లాడు. చూసుకోకుండా వేడి వేడిగా అప్పుడే పొయ్యి మీద నుంచి దింపిన సాంబార్ లో పడిపోయాడు.
 
దీంతో బాలుడికి తీవ్రగాయాలయ్యాయి. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే చిన్నారి ఆరుష్ ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా... రెండు రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆరుష్ కన్నుమూశాడు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.