ఓ కారు దొంగతనం కేసు... దానికి వెనక ఉన్న అసలు గుట్టును రట్టు  చేశాయి. తుపాకీలతో బెదిరించి మరీ... కొందరు ముఠా ఓ కారును దొంగతనం చేశాయి. కారు దొంగతనానికి ఇంత సాహసం ఎందుకు చేశారా అని పోలీసులు ఆరా తీయగా.... విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. ఆ కారులో కోట్ల నగదు ఉందని... ఆ నగదు వెనక దొంగ బంగారం వ్యవహారం ఉందని తేలింది. ఈ సంఘటన  హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఈ నెల 28వ తేదీన రాత్రిసమయంలో నలుగురు దుండగులు... హైదరాబాద్- బెంగళూరు జాతియ రహదారిపై ఓ కారును హైజాక్ చేశారు. కారులోని ఇద్దరు యువకులను తుపాకీలతో బెదిరించి మరీ... కారు దొంగలించారు. కారు యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు  చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆ దొంగల ముఠాను పట్టుకుంది. కాగా కథ సుఖాంతం అనుకునేలోగా... అసలు నిజాలు బయటపడ్డాయి.

ఆ కారులో భారీ నగదు తరలిస్తున్నారని కారు డ్రైవర్ మయూరేష్ మనోహర్ కి తెలుసు. దీంతో... అతని సమాచారంతో మహారాష్ట్రకు చెందిన ఓ ముఠా ఈ దొంగతనానిక ిపాల్పడింది. నిందితులు విశ్వజిత్‌ చంద్రకాంత్‌(21),  ఆకాశ్‌ కాంబ్లే(23), సన్నీ చవాన్‌(21), ఆకాశ్‌ దీపక్‌ రాథోడ్‌(20)గా గుర్తించారు. కారు హైజాక్ చేసి... అందులో నగదుని వారంతా పంచుకున్నారు. ఆ తర్వాత మరో కారు హైజాక్ చేయడానికి వచ్చి పోలీసులకు చిక్కారు. 

అసలు అంత డబ్బు కారు యజమానికి ఎలా వచ్చిందని ఆరా తీయగా.. అతని దొంగ బంగారం వ్యాపారం బయటపడింది. మహారాష్ట్రకు చెందిన రాజు నంగ్రే మైసూరులో స్థిరపడ్డాడు. పన్ను ఎగవేస్తూ కేరళలో బంగారాన్ని కొని మెట్రోనగరాల్లోని వ్యాపారులకు అక్రమంగా విక్రయిస్తుంటాడు. తన వద్ద పనిచేసే యువకుల్ని కేరళ పంపించి కార్లలోనే బంగారాన్ని తరలిస్తుంటాడు. బంగారం విక్రయించిన తర్వాత వచ్చే నగదును సైతం అవే కార్లలో తెప్పించుకుంటాడు. ఇందు కోసం కారు సీట్ల కింద రహస్యంగా అరల్ని రూపొందించినట్లు వెల్లడైంది.