2003లో గుజరాత్‌ మాజీ హోంమంత్రి హరేన్‌ పాండ్యా హత్య కేసులో 12మంది నిందితుల్లో ఏడుగురికి ట్రయల్‌ కోర్టు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. కాగా.. ఆ తీర్పును తాజాగా  సుప్రీంకోర్టు సమర్థించింది.  12 మంది నిందితుల్లో ఇద్దరు తెలంగాణవాసులు ఉండటం గమనార్హం. కాగా.. ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకునేందుకు గుజరాత్ పోలీసులు తెలంగాణకు వస్తున్నారు.

నల్గొండకు చెందిన అస్ఘర్ అలీ, సైదాబాద్ కి చెందిన మహ్మద్ రాఫ్ లను అరెస్టు చేయనున్నారు.కాగా ఈ కేసులో నిందితుడైన అస్ఘర్ అలీ.. గత సంవత్సరం మిర్యాలగూడలో కలకలం రేపిన ప్రణయ్ పరువు హత్యలో కూడా ప్రధాన నిందితుడు కావడం గమనార్హం. 

  హరెన్ పాండ్యా హత్య కేసులో తాజా దర్యాప్తును కోరుతూ సిపిఐఎల్‌ అనే ఎన్‌జిఒ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీన్ని స్వీకరించేందుకు తగిన ప్రాతిపదిక లేదని, దీనికి సంబంధించి మరే పిటిషన్‌ను స్వీకరించబోమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ ఎన్‌జిఒ సంస్థకు రూ.50 వేల జరిమానా విధించింది. ఈ కేసులో నిందితులపై చేసిన హత్య ఆరోపణలు వీగిపోయాయని, వారిని నిర్దోషులుగా ప్రకటిస్తూ గుజరాత్‌ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ సిబిఐ, గుజరాత్‌ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌లను జస్టిస్‌ అరుణ్‌మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం అనుమతించింది.

 కాగా, మార్చి 2003లో పాండ్యా హత్య కేసులో 12 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ పలువురు పిటిషన్‌లు దాఖలు చేశారు. గతంలో సుప్రీంకోర్టు ఈ కేసుకు సంబంధించి తీర్పును రిజర్వ్‌లో ఉంచిన సంగతి తెలిసిందే. కాగా, హత్య, హత్యకు కుట్ర ఆరోపణలపై నమోదైన కేసుల్లో ఉగ్రవాద నిరోధక చట్టం (పిఒటిఎ) కింద 12 మంది నిందితులను ట్రయల్‌ కోర్టు విధించిన శిక్షను సుప్రీంకోర్టు సమర్థించింది. ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ.. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హరెన్ పాండ్యా హోం మంత్రిగా చేశారు.