ఒకే నెంబర్ ప్లేట్ తో... హైదరాబాద్ నగరంలో రెండు కార్లు హల్ చల్ చేస్తున్నాయి.  అయితే.. ఆ రెండు కార్లలో ఒకటి తనది కాదని.. తన నెంబర్ ప్లేట్ ని మరో వ్యక్తి వాడేస్తున్నాడంటూ ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

పూర్తి వివరాల్లోకి వెళితే... బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని ఫార్చున్ ఎన్ క్లేవ్ లో నివిసించే డాక్టర్ కె.వనజా రఘునందన్ పేరిట సన్ సెట్ ఆరెంజ్ కలర్ హోండా జాజ్ టీఎస్ 09ఈఎల్ 5679 కారు రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది.

Also Read ఒంటిపై బంగారంతో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం...

కాగా... గత నెల 20వ తేదీన వనజా రఘునందన్ కు మహమబ్ నగర్ జిల్లా పోతులమబుగు వద్ద ఓవర్ స్పీడ్ గా వెళ్లినట్లు చలానా వచ్చింది. ఆ రోజు తాను ఎక్కడికి వెళ్లలేదని, చలానాలో ఉన్న కారు కూడా తనది కాకపోవడంతో ఆరా తీశారు. తన కారు నంబర్‌తోనే చాక్లెట్‌ కలర్‌ ఓల్వో కారు కూడా తిరుగుతోందని ఆమె గుర్తించారు.

మహబూబ్‌నగర్‌ జిల్లా పోతులమడుగు వద్ద ఓవర్‌స్పీడ్‌లో నిబంధనలు ఉల్లంఘించిన కారు అదేనని కావాలనే ఎవరో తన కారు నంబర్‌ను వాడుతూ తనకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన నంబర్‌తో ఓల్వో కారు నడుపుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని భవిష్యత్‌లో తనకు ఇది ప్రమాదం కూడా తలెత్తే అవకాశాలున్నాయని బాధితురాలు ఆందోళన వ్యక్తం చేశారు. బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసి ఓల్వో కారు కోసం గాలింపుచేపట్టారు.