తెలంగాణలో 22 వేలు దాటిన కరోనా: ఒక్కరోజే 1,850 కొత్త కేసులు, హైదరాబాద్‌లో కొనసాగుతున్న ఉగ్రరూపం
తెలంగాణలో కరోనా ఉగ్రరూపం కొనసాగుతోంది. శనివారం ఒక్కరోజే రాష్ట్రంలో 1,850 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం 22,312కి చేరింది
తెలంగాణలో కరోనా ఉగ్రరూపం కొనసాగుతోంది. శనివారం ఒక్కరోజే రాష్ట్రంలో 1,850 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం 22,312కి చేరింది.
శనివారం కరోనాతో ఐదుగురు మరణించడంతో... మొత్తం మృతుల సంఖ్య 288కి చేరుకుంది. ఈరోజు ఒక్క హైదరాబాద్‌లోనే 1,572 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత రంగారెడ్డి 92, మేడ్చల్‌లో 53 మందికి వైరస్ నిర్థారణ అయ్యింది.
వరంగల్ అర్బన్ 31, కరీంనగర్ 18, నిజామాబాద్ 17, నల్గొండ 10, వరంగల్ రూరల్ 6, మహబూబ్‌నగర్, సిద్ధిపేట, జగిత్యాలలో ఐదేసి చొప్పున, ఖమ్మం 7, సంగారెడ్డి 8, గద్వాల 2, మెదక్, నిర్మల్, భువనగిరిలో ఒక్కో కేసు నమోదయ్యాయి.
తెలంగాణలో ప్రస్తుతం 10,487 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇవాళ 6,427 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,10,545 టెస్టులు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
హైదరాబాద్‌లో కరోనా భయాన్ని వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు. బ్యూటీ పార్లర్లను ఐసోలేషన్ సెంటర్లుగా మార్చేస్తున్నారు. నిబంధనలను తుంగలో తొక్కి కరోనా రోగులకు గదులను అద్దెకిస్తున్నారు.
ఇందులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండానే పాజిటివ్ వ్యక్తులు వస్తున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం.5లో బ్యూటీ స్టూడియో కరోనా బాధితుల ఐసోలేషన్ సెంటర్‌గా మారిపోయింది. రోజుకు రూ.10 వేలు ఫీజు వసూలు చేస్తున్న నిర్వాహకులు.. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదు.
దీనిని పోలీసులు సుమోటాగా తీసుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. కరోనా కారణంగా నగరంలో అన్నీ మూతపడ్డాయి. ఆ తర్వాత సడలింపులు ఇచ్చినా... బ్యూటీపార్లర్లకు రావడానికి ప్రజలు అంతా మొగ్గుచూపడం లేదు.
దీంతో అందానికి మెరుగులు దిద్దే బ్యూటీని పార్లర్‌ను ఐసోలేషన్ సెంటర్‌గా మార్చేశారు. నిబంధనలను తుంగలో తొక్కి కోవిడ్ 19 రోగులకు గదులు అద్దెకు ఇస్తున్నారు.