కరోనా విషయంలో ఎంత అప్రమత్తంగా ఉండాలో తెలిపే సంఘటన ఒకటి హైదరాబాద్ లో వెలుగుచూసింది. ఒక్కరు సిగరెట్ ముట్టించుకుంటే 18 మంది కరోనా బారిన పడ్డారు. వారితో ఇంకెంతమంది కరోనాకు ఎఫెక్ట్ అయ్యారో తెలియాల్సి ఉంది.

హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని ఓ మార్కెటింగ్ మేనేజర్ నిర్వాకం వల్ల ఇప్పుడు ఆ 18మంది ఐసోలేషన్ ఉండే పరిస్థితి నెలకొంది. ఇంకెంతమంది దీని బారిన పడ్డారో అనే ఆందోళన నెలకొంది. 

వివరాల్లోకి వెడితే..  శ్రీనగర్‌ కాలనీలో నివాసముండే ఓ మార్కెటింగ్‌  మేనేజర్‌ ఇటీవల ఆఫీస్ పని మీద బయటకు వెళ్లాడు. ఆ సమయంలో కేబీఆర్ పార్క్ దగ్గర ఆగాడు. సిగరెట్ తాగాలనుకున్నాడు. అయితే తన దగ్గర లైటర్ కానీ అగ్గిపెట్టె కానీ లేకపోడంతో.. పక్కనే ఒకతను సిగరెట్ కాలుస్తుంటే.. అతని దగ్గర సిగరెట్ తీసుకుని తన సిగరెట్ అంటించుకున్నాడు.

ఆ తరువాత ఎప్పట్లాగే తన పనుల్లో పడిపోయాడు. కాగా ఈ ఘటన జరిగిన మూడు రోజుల తరువాత  జ్వరం, ఒంటి నొప్పులతో అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితికి చేరుకున్నాడు. శ్వాస తీసుకోవడంతో సమస్య తలెత్తింది. దీంతో సిటీస్కాన్ చేయించగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 

అంతేకాదు 30 శాతం లంగ్స్ దెబ్బతిన్నాయని చెప్పారు. మార్కెటింగ్ టీమ్ కు హెడ్ అయిన ఆయన విషయాన్ని తన టీం సభ్యులకు తెలిపాడు. 20 మందిలో 18 మందికి కరోనా నిర్థారణ అయ్యింది. ఈ 18 మంది వల్ల ఇంకెంత మందికి కరోనా వచ్చిందనే విషయం ఇంకా తేలలేదు. 

కానీ, టీం సభ్యులంతా ఆ మేనేజర్ వల్లే తమకు పాజిటివ్ వచ్చిందని కంపెనీ హెచ్ ఆర్ ముందు బాహాటంగానే తెలిపారు. దీంతో ఆయన తనకు ఎక్కడ కరోనా సోకిందా? అనే విషయం తెలుసుకునేందుకు. వారం రోజుల క్రితం నుంచి తాను కలిసిన వ్యక్తులను ఆరా తీశాడు.

చివరకు తాను సిగరెట్ అంటించుకునేందుకు ఓ వ్యక్తి  తాగుతున్న సిగరెట్‌ తీసుకోవడమే కారణంగా నిర్థారణకు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికి సుఖంగా ఉన్న ప్రాణానికి సిగరెట్ తో కరోనా అంటించుకోవడమే కాకుండా పలువురికి అంటించాడని టీం సభ్యులు భావిస్తున్నారు. 

కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పకుండా ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఏషియానెట్ విజ్ఢప్తి చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా కరోనా టీకా తీసుకోవాలని కూడా కోరుతోంది. అందరం కలిసి కరోనా వ్యాప్తిని అరికడుదాం, మనల్ని మనం రక్షించుకుందాం.  #ANCares #IndiaFightsCorona