భూపాలపల్లిలో 17 ఏళ్ల బాలుడు దారుణానికి ఒడిగట్టాడు. డబ్బుల కోసం కన్నతండ్రినే హతమార్చాడు. అనంతరం డెడ్ బాడీని చెరువులో పడేశాడు. ఏమీ తెలియనట్టు నటించాడు. కానీ గ్రామస్తులు నిలదీయడంతో నిజం ఒప్పుకున్నాడు.

17 ఏళ్ల కుర్రాడు. చక్కగా కాలేజీకి వెళ్లి చదువుకోవాల్సింది పోయి మద్యానికి బానిసయ్యాడు. ఏడో తరగతిలోనే బడికి వెళ్లడం మానేశాడు. తల్లి అనారోగ్యంతో మరణించింది. తండ్రితో పాటు కలిసి కలిసి ఉంటున్నాడు. తండ్రిచి చేదోడు వాదోడుగా ఉండాల్సిన సమయంలో డబ్బుల కోసం ఇబ్బంది పెట్టేవాడు. ఈ క్రమంలో తాజాగా కూడా తనకు డబ్బులివ్వాలని కోరడంతో తండ్రి నిరాకరించాడు. దీంతో కోపంతో తండ్రిని హతమార్చాడు. ఈ దారుణ ఘటన భూపాలపల్లి జిల్లాలోని రూరల్ మండలంలో చోటు చేసుకుంది. 

వివరాలు ఇలా ఉన్నాయి. భూపాలపల్లి మండలంలోని దూదేకులపల్లిలో 48 ఏళ్ల తిరుపతి తన 17 ఏళ్ల కుమారుడితో కలిసి నివసిస్తున్నాడు. అతడి భార్య రాజమణి 18 నెలల కిందట ఆనారోగ్యానికి గురై చనిపోయారు. ఆయన కూడా ఓ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. సరిగ్గా పని చేయలేని పరిస్థితి ఉండటంతో తనకు ఉన్న 7 ఎకరాల భూమిని వేరేవారికి కౌలుకు ఇచ్చాడు. అయితే కుమారుడు ఏడో తరగతిలోనే బడికి వెళ్లడం మానేశాడు. అప్పటి నుంచి తాగుడుకు బానిస అయ్యాడు. 

కాగా.. తిరుపతి తన వ్యవసాయ పట్టాదారు పాసు పుస్తకాలను తన సోదరి వద్ద భద్రపరిచాడు. ఈ విషయం నచ్చని బాలుడి తండ్రితో తరచూ గొడవకు దిగేవాడు. ఈ క్రమంలో తిరుపతి తన వద్ద ఉన్న ఓ ఆవును అమ్మేశాడు. వచ్చిన డబ్బులను తను ఇవ్వాలని కుమారుడు కోరాడు. దీనికి తండ్రి ఒప్పుకోలేదు. దీంతో ఆ బాలుడు తండ్రిపై కక్ష పెంచుకున్నాడు. ఈ నెల 16వ తేదీన రాత్రి తండ్రి ఇంట్లో నిద్రపోతున్నాడు. ఈ క్రమంలో కుమారుడు తిరుపతి తలపై దారుణంగా కొట్టాడు. అనంతరం మెడకు తాడును బిగించాడు. దీంతో ఊపిరాడక తండ్రి చనిపోయాడు. 

అనంతరం డెడ్ బాడీని ఇంట్లో ఉన్న దుప్పట్లో చుట్టాడు. ఓ మూలకు ఉంచాడు. రెండు రోజులు ఇంట్లోనే ఉన్నాడు. తరువాత డెడ్ బాడీ నుంచి దుర్వాసన రావడం గ్రామంలో తెలిసిన వారి ఇళ్లలో ఉన్నాడు. తండ్రి ఎక్కడికో వెళ్లాడని, ఆ విషయం కూడా తనకు చెప్పలేదని గ్రామస్తులు చెప్పాడు. పలువురు బంధువుల కూడా ఫోన్ చేసి తండ్రి గురించి ఆరా తీశాడు. ఇది చూసి గ్రామస్తులు కూడా తిరుపతి ఎక్కడికో చెప్పకుండా వెళ్లాడని భావించారు. 

కాగా.. డెడ్ బాడీ నుంచి దుర్వాసన ఎక్కువగా వస్తుండటంతో శనివారం రాత్రి బైక్ పై తీసుకెళ్లి, చెరువులో పడేసి వచ్చాడు. తరువాత ఏమీ తెలియనట్టు నటించాడు. ఆదివారం ఉదయం డెడ్ బాడీని గ్రామస్తులు గుర్తించారు. బాలుడు ప్రవర్తనపై అనుమానం రావడంతో గట్టిగా నిలదీశారు. దీంతో తానే తండ్రిని హతమార్చినట్టు వెల్లడించాడు. పోలీసులు అక్కడికి చేరుకొన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.