తెలంగాణ ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ముగిసింది. ఎంసెట్ స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్‌తో బీటెక్‌ ప్రవేశాల ప్రక్రియ ముగిసిందని అధికారులు గురువారం ప్రకటించారు. అయితే ఈ ఏడాది భారీగా ఇంజనీరింగ్ సీట్లు మిగిలిపోయాయి.

తెలంగాణ ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ముగిసింది. ఎంసెట్ స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్‌తో బీటెక్‌ ప్రవేశాల ప్రక్రియ ముగిసిందని అధికారులు గురువారం ప్రకటించారు. అయితే ఈ ఏడాది భారీగా ఇంజనీరింగ్ సీట్లు మిగిలిపోయాయి. ఇంజనీరింగ్ కన్వీనర్ కోటాలో ఏకంగా 6, 296 సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. రాష్ట్రంలో 178 ఇంజినీరింగ్ కాలేజ్‌ల్లో మొత్తం 85,671 సీట్లు అందుబాటులో ఉండగా.. 69,375 (80.97 శాతం) సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. సీఎస్‌ఈ, ఐటీ కోర్సుల్లో 5,723 సీట్లు భర్తీ కాలేదు. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఎలక్ట్రికల్‌లో 4,959 సీట్లు, సివిల్‌, మెకానిక్‌లలో మరో 5,156 సీట్లు మిగిలిపోయాయని తెలిపారు. 

ఈసారి ఐదు యూనివర్సిటీలు, 19 ప్రైవేట్ విద్యాసంస్థలు 100 శాతం అడ్మిషన్లు నమోదు చేసుకోగా, ఒక కాలేజీ జీరో ఎన్‌రోల్‌మెంట్‌తో సరిపెట్టుకుంది. బీఫార్మసీ, ఫార్మ్ డీ కోర్సుల్లో 2,858 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఎంపీసీ నేపథ్యం ఉన్న విద్యార్థులు కూడా ఫార్మసీ ప్రవేశానికి అర్హులుగా పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇక, ప్రైవేట్‌ కాలేజీల్లో 14,511 సీట్లు మిగిలిపోగా.. ప్రైవేట్‌ యూనివర్సిటీల్లో 289 సీట్లు, యూనివర్సిటీ కాలేజీల్లో 1,496 సీట్లు మిగిలిపోయాయి.

ఇంజనీరింగ్ కోర్సుల అడ్మిషన్ కౌన్సెలింగ్‌లోని అన్ని దశల్లో మొత్తం 83,369 మంది విద్యార్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌లో పాల్గొన్నారు.స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో 19,320 మంది అభ్యర్థులు వెబ్ ఆప్షన్‌లను ఉపయోగించుకున్నారు. ఇందులో 10,535 మంది స్లైడింగ్ ద్వారా మెరుగైన బ్రాంచ్‌లను పొందారు. మొత్తంగా 1,966 మంది కొత్త కేటాయింపులను పొందారు. స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో సీటు అలాట్‌మెంట్ పొందిన అభ్యర్థులు తప్పనిసరిగా https://tseamcet.nic.in/ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో ట్యూషన్, సెల్ఫ్ రిపోర్టును ఆగస్టు 28 లేదా అంతకు ముందు చెల్లించాల్సి ఉంటుంది. ఆగస్టు 25 నుంచి 29 మధ్య వారికి కేటాయించిన కళాశాలలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.