తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్నాయి. తాజాగా వరంగల్ ఎన్ఐటీలో 16మంది విద్యార్థులు ఈ మహమ్మారి బారిన పడ్డారు.
వరంగల్: ఓవైపు ఒమిక్రాన్ (omicron) భయం వెంటాడుతున్న వేళ భారత్ లో కరోనా (corona కలకలం కూడా మొదలయ్యింది. గతకొంత కాలంగా చాలా తక్కువగా నమోదయిన కేసుల సంఖ్య ఒక్కసారిగా భారీగా పెరిగిపోయాయి. తెలంగాణలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో తాజాగా వరంగల్ ఎన్ఐటీ (warangal NIT) క్యాంపస్ లోకి కరోనా మహమ్మారి ప్రవేశించింది. ఇప్పటివరకు 16మంది ఎన్ఐటీ విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది.
క్రిస్మస్ పండగ సందర్భంగా ఎన్ఐటీ విద్యార్థులు కొందరు ఇళ్లకు వెళ్లివచ్చారు. అయితే వీరిలో కొందరికి కరోనా లక్షణాలు కనిపించడంతో క్యాంపస్ అధికారులు అనుమానంతో టెస్టులు చేయించగా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో క్యాంపస్ లోని మిగతా స్టూడెంట్స్ కు కూడా కరోనా టెస్టులు చేయగా మొత్తం 16మందికి పాజిటివ్ గా తేలింది.
ఇలా క్యాంపస్ లో భారీగా కరోనా కేసులు వెలుగుచూడటంతో అప్రమత్తమైన అధికారులు ఈ నెల 16వరకు సెలవులు ప్రకటించారు. ఇప్పటికే కరోనా నిర్దారణ అయిన విద్యార్థులను ఐసోలేషన్ లో వుంచి చికిత్స అందిస్తున్నట్లు ఎన్ఐటీ డైరెక్టర్ తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని... అందరు విద్యార్థులు ఆరోగ్యంగానే వున్నారని ఆయన పేర్కొన్నారు.
ఇక తెలంగాణలో కేవలం 24గంటల్లో (గురువారం సాయంత్రానికి) కరోనా కేసుల సంఖ్య రెండువేలకు చేరువగా నమోదయ్యింది. గత మూడు రోజులుగా పాజిటివిటీ రేటు గణనీయంగా పెరిగింది. నిన్న(గురువారం) రాష్ట్రంలో 54,534 మందికి కరోనా టెస్టులు చేయగా 1,913 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో కోవిడ్ బారినపడిన వారి సంఖ్య 6,87,456కి చేరింది.
24 గంటల వ్యవధిలో తెలంగాణలో కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వీరితో కలిపి రాష్ట్రంలో కోవిడ్ వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,036కి చేరింది. కరోనా నుంచి నిన్న 232 మంది కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 7,847 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 4, భద్రాద్రి కొత్తగూడెం 8, జీహెచ్ఎంసీ 1214, జగిత్యాల 9, జనగామ 4, జయశంకర్ భూపాలపల్లి 0, గద్వాల 4, కామారెడ్డి 7, కరీంనగర్ 24, ఖమ్మం 25, మహబూబ్‌నగర్ 12, ఆసిఫాబాద్ 4, మహబూబాబాద్ 33, మంచిర్యాల 12, మెదక్ 9, మేడ్చల్ మల్కాజిగిరి 161, ములుగు 0, నాగర్ కర్నూల్ 2, నల్గగొండ 16, నారాయణపేట 1, నిర్మల్ 0, నిజామాబాద్ 28, పెద్దపల్లి 13, సిరిసిల్ల 3, రంగారెడ్డి 213, సిద్దిపేట 14, సంగారెడ్డి 24, సూర్యాపేట 10, వికారాబాద్ 12, వనపర్తి 5, వరంగల్ రూరల్ 3, హనుమకొండ 24, యాదాద్రి భువనగిరిలో 15 చొప్పున కేసులు నమోదయ్యాయి.
ఇప్పటికే కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ మారణహోమం సృష్టించింది. ముఖ్యగా సెకండ్ వేవ్ లో డెల్టా వేరియంట్ వ్యాప్తి ప్రమాదకరంగా మారి అత్యధిక ప్రాణాలను బలితీసుకుంది. ఈ నేపథ్యంలోనే థర్డ్ వేవ్ పై అప్రమత్తంగా వుండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చాలాకాలంగా హెచ్చరిస్తూ వస్తున్నాయి. తాజాగా కేసుల సంఖ్యం గణనీయంగా పెరగడంతో థర్డ్ వేవ్ మొదలయినట్లేనని వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.
ఇక ఇటీవల దక్షిణాఫ్రికాలో బయటపడిన కరోనా న్యూ వేరియంట్ ఒమిక్రాన్ భారత్ లోకి ప్రవేశించి వేగంగా వ్యాపిస్తోంది. తెలంగాణలో కూడా ఈ వైరస్ కేసులు అధికంగా వెలుగుచూసాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆదేశాలతో తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలను కఠినతరం చేసింది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ, వీకెండ్ కర్ప్యూ వంటిని అమలు చేస్తుండగా మరికొన్ని రాష్ట్రాలు కూడా ఆ దిశగానే అడుగులు వేస్తున్నాయి.
