తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్.. రాష్ట్ర వ్యాప్తంగా సజావుగా సాగుతోంది. అయితే.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం.. ఓట్లు వేయడానికి వెళ్లిన చాలా మంది ఓటర్లు నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఎందుకంటే.. చాలా ప్రాంతాల్లో చాలా మంది పేర్లు ఓటర్ల జాబితాలో లేవు. 

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో ఓటర్ లిస్ట్ లో పేర్లు లేవని ఆర్మూర్ తహసీల్దార్ కార్యాలయం ముందు బాధితులు ఆందోళకు దిగారు. ఎన్నికలను రద్దు చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసు ఎదట ఓటర్ లిస్టులో తమ పేర్లు లేవని బాధితులు ఆందోళనకు దిగారు. 

ఎల్లమ్మగుట్ట ప్రాంతంలో చనిపోయిన వారి పేర్లు ఓటర్ లిస్టులో ఉన్నాయి, కానీ బ్రతికి ఉన్న వారి పేర్లు ఓటర్ లిస్టులో లేవని బాధితులు తమ నిరసన వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామంలో 1500 ఓట్లు గల్లంతు అవ్వడంతో బీక్కనూర్ ఎంఆర్‌ఓనీ గ్రామస్థులు నిలదీశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఓటర్ లిస్టులో తమ పేరు లేదని చెన్నూరు ఎమ్మార్వో ఆఫీస్ ముందు బాధితులు నిరసన తెలిపారు.