సారాంశం

Manair River: మంథని సమీపంలోని మానేరు నదిలో చిక్కుకుపోయిన వారిని ర‌క్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరద నీటిలో కొట్టుకుపోయిన ఒక వ్య‌క్తి ఈదుకుంటూ సురక్షితంగా ఒడారం గ్రామం వద్ద ఒడ్డుకు చేరుకున్నాడు. అలాగే, ఖ‌మ్మం జిల్లాలోని మున్నేరు వాగు సైతం ఉగ్ర‌రూపంలో ప్ర‌వ‌హిస్తోంది. దీంతో ఆ ప్రాంతం నీట‌మునిగింది. అధికారులు స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. 
 

Telangana rains: పెద్దపల్లి జిల్లాలోని మంథని మండలం గోపాల్‌పూర్‌ సమీపంలోని మానేరు నదిలో ఇసుక క్వారీల్లో పనిచేస్తున్న 15 మంది డ్రైవర్లు, ఇతర కార్మికులు గురువారం గల్లంతయ్యారు. వరద నీటిలో కొట్టుకుపోయిన మధు అనే వ్యక్తి ఈదుకుంటూ సురక్షితంగా ఒడారం గ్రామం వద్ద ఒడ్డుకు చేరుకున్నాడు. మరికొందరు ఎక్స్‌కవేటర్‌పై ఆశ్రయం పొంది జిల్లా యంత్రాంగానికి ఫోన్‌లో విషయం తెలియజేయడంతో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పుట్టా మధుకర్‌తో కలిసి మానేర్ నది ఒడ్డుకు చేరుకుని రెండు స్పీడ్ బోట్‌లను ఏర్పాటు చేసి రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. ఇదే స‌మ‌యంలో ఒక ఎక్స్‌కవేటర్ వరదలో కొట్టుకుపోయింద‌ని స‌మాచారం.

మున్నేరు ఉగ్రరూపం.. 

ఖ‌మ్మం జిల్లాలోని మున్నేరు వాగు సైతం ఉగ్ర‌రూపంలో ప్ర‌వ‌హిస్తోంది. దీంతో ఆ ప్రాంతం నీట‌మునిగింది. అధికారులు స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. మున్నేరు వాగు ప్ర‌వాహంతో ప‌రివాహ‌క ప్రాంతాలు నీట మునిగాయి. పెద్ద ఎత్తున ఇండ్లు మునిగిపోవడంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. జిల్లా యంత్రాంగం లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ఖాళీ చేయించి పునరావస కేంద్రాలకు తరలించే పనులు చేప‌ట్టారు. మోతే నగర్, మంచి కంటి నగర్, వాసవి నగర్, పంపింగ్ వెల్ రోడ్డు పెద్దమ్మ గుడి, బురద రాగాపురం, ఇండియన్ గ్యాస్ గోడౌన్, సుందరయ్య నగర్, ధంసలాపురం, శ్రీనివాస్ నగర్, ప్రాంతాల్లో ఇండ్లు నీట మునిగాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పెద్ద ఎత్తున మున్నేరు ప్రవహిస్తుందని స్థానికులు చెబుతున్నారు.