బాలుడిపై 15కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ దాడిలో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ దారుణ సంఘటన మౌలాలిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...మౌలాలి గుట్టపైనున్న దర్గాలో రెండు రోజులుగా అజ్రత్‌ అలీ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. సోమవారం రాత్రి 9గంటల సమయంలో అఖిల్‌ అనే ఆరేళ్ల చిన్నారి కుటుంబసభ్యులతో కలిసి అక్కడికి వెళ్లాడు. 

అయితే అఖిల్‌ అక్కడ ఆడుకుంటున్న సమయంలో 15 వీధి కుక్కలు దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన అఖిల్‌ను కుటుంబసభ్యులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. జనరల్‌ సర్జరీ విభాగంలో చికిత్స పొందుతున్న అఖిల్‌ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. విషయం తెలుసుకున్న మల్కాజిగిరి వెటర్నరీ విభాగం అధికారులు మౌలాలి గుట్టను సందర్శించి అక్కడి పరిసరాలను పరిశీలించారు. 

మున్సిపల్‌ వెటర్నరీ అధికారి శ్రీనివాస్‌రెడ్డి అక్కడి కుక్కలను వెటర్నరీ కేంద్రానికి తరలించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్భంగా స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకులు అమినుద్దీన్, కాంగ్రెస్‌ నాయకులు వంశీముదిరాజ్, షరీఫ్, కాలనీ వాసులు అక్కడికొచ్చి అధికారులను నిలదీశారు. వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. 

ఈ ఘటనకు సంబంధించి జీహెచ్‌ఎంసీ బాధ్యత వహించాలని బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావు అన్నారు. బాలుడికి మెరుగైన వైద్యం అందించి, రూ.5లక్షల నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. వెటర్నరీ అధికారిని సస్పెండ్‌ చేయాలన్నారు.