పూల దుకాణం ఆ అమ్మాయి పాలిట ముళ్లబాటగా మారింది. పని ఇచ్చినట్టే ఇచ్చి లైంగికదాడి చేసి ఆ చిన్నారి మొగ్గను చిదిమేశాడో కిరాతకుడు. మూడు నెలలుగా జరుగుతున్న ఈ దారుణం ఇటీవలే వెలుగులోకి వచ్చింది. 

వివరాల్లోకి వెడితే రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో  ఓ పూల దుకాణం యజమాని తన దగ్గర పనిచేస్తున్న బాలికపై మూడు నెలలుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు.  ఇటీవల అతని దాడి మరింత తీవ్రం కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక హుడా కాలనీలో నివసించే బాలిక(14) పట్టణంలోని సతీష్‌(40) పూల దుకాణంలో కొంతకాలంగా పనిచేస్తోంది. పని అయిపోయాక బాలికను బైక్‌పై ఇంటి వద్ద వదిలేసే క్రమంలో మూడు నెలలుగా సతీష్ బాలికపై లైంగిక దాడి చేస్తున్నాడు. 

ఇటీవల అనారోగ్యంతో ఉన్న సమయంలో కూడా దారుణానికి ఒడిగట్టేందుకు యత్నించడంతో బాలిక అఘాయిత్యాన్ని కుటుంబసభ్యులకు తెలిపింది. దీంతో కుటుంబసభ్యులు మంగళవారం ఆర్‌జీఐఏ పోలీసులను ఆశ్రయించారు. 

ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు బాలికను వైద్య పరీక్షలకు పంపారు. సతీష్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాలకార్మికురాలిని పనిలో పెట్టుకోవడంతో పాటు అత్యాచారానికి ఒడిగట్టిన అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.