జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్నపై హత్యాయత్నం కేసు.. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు..
జర్నలిస్టు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్నను మంగళవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా తీన్మార్ మల్లన్నకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.

జర్నలిస్టు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్నను మంగళవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తీన్మార్ మల్లన్నపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. సాయి కరణ్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేసినట్టుగా ఎఫ్‌ఐఆర్ ద్వారా వెల్లడైంది. అయితే తీన్మార్ మల్లన్నతో పాటు మరో నలుగురిని మేడిపల్లి పోలీసులు.. ఈ రోజు హయత్ నగర్ మునగనూరులోని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. న్యాయమూర్తి తీన్మార్ మల్లన్నతో పాటు మరో నలుగురికి 4రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.రిమాండ్ విధించడంతో వారిని చర్లపల్లి జైలుకు తరలించారు.
ఇక, తీన్మార్ మల్లన్నపై నమోదైన ఎఫ్ఐఆర్ కాపీ బయటకు వచ్చింది. సాయి కరణ్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు పేర్కొన్నారు. ఇక, తీన్మార్ మల్లన్నపై మేడిపల్లి పోలీస్ స్టేషన్లో 148, 307, 342, 506, 384, 109, R/W 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఇదిలా ఉంటే.. తీన్మార్ మల్లన్నను పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత టీ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆయన ఇంటికి వెళ్లారు. ఆయన కుటుంబ సభ్యులకు మద్దతు తెలిపారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం విధానాలను ప్రశ్నిస్తున్న వారి గొంతు నొక్కేస్తోందని ఆరోపించారు. తీన్మార్ మల్లన్న, తెలంగాణ విఠల్‌లను వెంటనే విడుదల చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
ఇదిలా ఉంటే.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ ప్రశ్నించడంపై తీన్మార్ మల్లన్న ఇటీవల తన యూట్యూబ్ ఛానెల్‌లో వీడియో క్లిప్‌ను అప్‌లోడ్ చేశాడు. అయితే ఆ వీడియోపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే సోమవారం తీన్మార్ మల్లన్నకు చెందిన క్యూ న్యూస్ ఆఫీసుపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఇందుకు సంబంధించి తీన్మార్ మల్లన్న పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అయితే నాటకీయ పరిణామాల మధ్య క్యూ న్యూస్ ఆఫీసులో సోదాలు నిర్వహించిన పోలీసులు.. అనంతరం తీన్మార్ మల్లన్నను అదుపులోకి తీసుకున్నారు.