నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి శివారులో శనివారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ వాహనంలో తరలిస్తున్న ఆవులు సజీవదహనం అయ్యాయి. ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. 

నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి శివారులో శనివారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ వాహనంలో తరలిస్తున్న ఆవులు సజీవదహనం అయ్యాయి. ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. వివరాలు.. కొందరు వ్యక్తులు అంబులెన్స్‌ అని స్టిక్కర్ టెంపో వాహనంలో ఆవులను తరలిస్తున్నారు. నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న అంబులెన్స్ మాక్లూర్‌తండా సమీపంలోకి చేరుకోగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో డ్రైవర్ వాహనాన్ని రోడ్డు పక్కనే ఆపేసి పరారయ్యాడు.

వాహనంలో ఉన్నవారిని కాపాడాలనే ఉద్దేశంతో రోడ్డుపై వెళ్లేవారు అద్దాలు పగలగొట్టారు. అయితే అప్పటికే అందులో అక్రమంగా తరలిస్తున్న ఆవులు సజీవ దహనం అయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాప సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అంబులెన్స్ డ్రైవర్ పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనలో మొత్తం 13 ఆవులు సజీవ దహనం అయ్యాయి. వాటిలో కొన్ని మంటలు అంటుకుని మరణించగా.. మరికొన్ని ఊపిరాడక చనిపోయి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. 

నిజామాబాద్ ఏసీపీ ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. వెటర్నరీ వైద్యులు ఆవులకు పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తుచేపట్టారు. అంబులెన్స్‌ రిజిస్ట్రేషన్, టోల్ ప్లాజా దగ్గర సీసీ టీవీ ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఇక, ఆవులను తరలిస్తున్న అంబులెన్స్‌లో ఉన్న సిలిండర్ లీక్ కావడం వల్లే మంటలు చెలరేగినట్టుగా పోలీసులు భావిస్తున్నారు.