పన్నెండేళ్ల వయసులోనే తాగుడుకు బానిసై జులాయిగా మారిన మైనర్ బాలుడు ఆ మత్తులోనే ఒకరిని కిరాతకంగా చంపి హంతకుడిగా కూడా మారాడు. ఈ దారుణం సంగారెడ్డి జిల్లాలో వెలుగుచూసింది.
సంగారెడ్డి :పాలు తాగి స్కూల్ కి వెళ్లాల్సిన వయసు ఆ బాలుడిది... కానీ మద్యం తాగి అమ్మాయిల వెంటపడుతూ జులాయి తిరుగుళ్లు తిరిగేవాడు. చదువు మానేసి మద్యంమత్తులో నేరాలకు పాల్పడుతున్న 12ఏళ్ల బాలుడు చివరకు అత్యంత కిరాతకంగా ఒకరిని చంపి హంతకుడిగా మారాడు. ఈ దారుణం సంగారెడ్డి జిల్లాలో వెలుగుచూసింది.
పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా హత్నూరు మండలం కొన్యాలకు చెందిన 12ఏళ్ల బాలుడు ఆరో తరగతిలోనే స్కూల్ మానేసాడు. ఊళ్లో తాగుబోతులు, జులాయిల వెంట తిరుగుతూ పూర్తిగా చెడిపోయాడు.ఫుల్లుగా మద్యం తాగడం, ఆ మత్తులో చిన్నచిన్న దొంగతనాలకు పాల్పడేవాడు.అంతేకాదు ఈ వయసులో అమ్మాయిల వెంటపడుతూ వేధించేవాడు. ఇలా నేరాల బాట పట్టిన బాలుడు చివరకు హంతకుడిగా మారాడు.
గత శుక్రవారం రాత్రి కొన్యాల గ్రామానికే చెందిన ఆమదయ్య ఈ బాలుడితో కలిసి మద్యం సేవించాడు. అర్ధరాత్రి వరకు ఫుల్లుగా మద్యం సేవించిన ఇద్దరిమధ్య మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది.దీంతో మత్తులో విచక్షణ కోల్పోయిన యువకుడు బీరు బాటిల్ పగలగొట్టి ఆమదయ్య గొంతులో పొడిచాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై అతడు అక్కడే కుప్పకూలి గిలగిలా కొట్టుకుంటున్నా బాలుడు ఆగలేదు.మళ్లీ గొంతులోని సీసాను కాలితో తొక్కి ప్రాణాలు పోయేవరకు దారుణంగా వ్యవహరించాడు. చనిపోయాడని నిర్దారించుకున్నాక జేబులోని రూ.500 తీసుకుని అక్కడినుండి వెళ్లిపోయాడు.
Read More హైదరాబాద్‌లో మరో బీటెక్ విద్యార్ధి బలవన్మరణం.. తల్లిదండ్రులు మందలించడంతోనే
రాత్రి ప్రభుత్వ పాఠశాల భవనంలో పడుకుని శనివారం ఉదయమే గుమ్మడిదలకు వెళ్ళి కొత్తబట్టలు కొనుక్కున్నాడు. మధ్యాహ్నం తనకేమీ తెలియదన్నట్లుగా గ్రామానికి వెళ్లాడు.అయితే అప్పటికే ఆమదయ్య మృతదేహాన్ని గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సిసి కెమెరాలను పరిశీలించి బాలుడే హంతకుడిగా తేల్చారు. ఇది తెలియని బాలుడు తాపీగా గ్రామానికి చేరుకోగా గ్రామస్తులు పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు.
తన కుటుంబసభ్యులను నోటికొచ్చినట్లు తిట్టడం వల్లే ఆమదయ్య హత్య చేసినట్లు బాలుడు కూడా పోలీసుల ముందు అంగీకరించినట్లు సమాచారం. దీంతో అతడిపై కేసు నమోదు చేసిన పోలీసులు జువైనల్ హోం కు తరలించారు.
పన్నెండేళ్ల వయసులో బాలుడు మద్యానికి బానిసవడం, ఒకరిని కిరాతకంగా చంపి హంతకుడిగా మారిన ఘటన కలవర పెడుతోంది.సినిమాల ప్రభావమో,సమాజం పోకడలో లేక తల్లిదండ్రుల నిర్లక్ష్యమో... కారణమేదైనా బంగారు భవిష్యత్ కలిగిన బాలుడు హంతకుడిగా మారి జైలుకెళ్లాల్సి వచ్చింది.
