హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రసమితి మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్ కు శ్రీకారం చుట్టబోతుందా...?ఇప్పటికే ఇద్దరు స్వతంత్రులను కలుపుకున్న టీఆర్ఎస్ ఇక టీడీపీ, కాంగ్రెస్ లను టార్గెట్ చేసిందా..? తెలంగాణలో ప్రతిపక్షం అనేది ఉండకూడదు అనే ఆలోచన టీఆర్ఎస్ మదిలో మెదులుతుందా..? అందుకే మంత్రి వర్గకూర్పుకు ఆలస్యానికి అసలు కారణం అదేనా..?  

అంటే అవుననే వార్తలు వెలువడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లి మళ్లీ రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ తమకు ఎదురులేకుండా ఉండేందుకు పావులు కదుపుతుంది. 

ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ తమపై చేసిన ఆరోపణలకు బదులు తీర్చుకునేందుకు రెడీ అవుతుంది. అందులో భాగంగానే ఆపరేషన్ ఆకర్ష్ ను మళ్లీ తెరపైకి తీసుకువచ్చిందని తెలుస్తోంది. 

2014లో 63 సీట్లతో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ఆ తర్వాత కాంగ్రెస్, టీడీపీ నేతలను ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో పార్టీలో చేర్చుకుంది. టీడీపీలో ఇద్దరు ఎమ్మెల్యేలను మాత్రమే విడిచిపెట్టి మిగిలిన వారిని తమవైపుకు లాగేసింది. వారిలో కొంతమందిని మంత్రి పదవులను సైతం కట్టబెట్టింది. 

టీడీపీయే కాదు బీఎస్పీ పార్టీ గుర్తుతో గెలిచిన అభ్యర్థిని కూడా పార్టీలోకి తీసుకుని ఏకంగా మంత్రిని చేసింది. తెలంగాణలో తమకు ఎదురులేదు అని నిరూపించుకుంది. తాజాగా మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్ ను తెరపైకి తేవాలని టీఆర్ఎస్ వ్యూహరచన చేస్తోందని అందుకే మంత్రి వర్గ కూర్పుకు ఆలస్యమవుతోందన్న ప్రచారం కూడా వస్తోంది.   

2018 ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ 88 సీట్లతో 75శాతం ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుంది. రెండోసారి అధికారంలోకి వచ్చింది. అయితే టీఆర్ఎస్ గెలిచిన తర్వాత మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో 88 కాస్త 90కి చేరుకుంది. 

ఇకపోతే ప్రస్తుతం ప్రజాకూటమి చేతిలో 21 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. వారిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 19 మంది ఎమ్మెల్యేలు ఉండగా... ఇదదరు టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎంఐఎం ఏడుగురు మరియు బిజెపి ఒక్క ఎమ్మెల్యే స్థానాలతో ఉన్నారు.  

అయితే ఈ ఎన్నికల్లో గెలిచిన టీడీపీ అభ్యర్థులు కాంగ్రెస్ లో కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ కలిస్తే కాంగ్రెస్ బలం 21కి చేరుతుంది. చేరకపోయినా ప్రజాకూటమి తరపున 21 మంది ఎమ్మెల్యేలు బాధ్యత వహిస్తారు. 

అయితే ఆ 21 మంది ఎమ్మెల్యేలలో టీఆర్ఎస్ పార్టీ 12 మంది అభ్యర్థులను ఆకర్షించాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ నేత మాజీమంత్రితో రాయబారం నడిపిస్తున్నట్లు సమాచారం. ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ గూటికి తీసుకు వచ్చే బాధ్యత ఆ నేతపై పెట్టినట్లు తెలుస్తోంది. 

 మెుత్తం ప్రజాకూటమి నుంచి 12 మందిని టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానిస్తే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా పోతుందని టీఆర్ఎస్ ఆలోచన. ప్రతిపక్ష హోదా రావాలంటే దాదాపు 10 శాతం ఓట్ల ఉండాలి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఉంది. 

ఒకవేళ 12 మంది ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ పార్టీలోకి జంప్ అయితే మాత్రం తెలంగాణలో ప్రతిపక్షం అనేది ఉండదు అన్నది టీఆర్ఎస్ ఆలోచనగా స్పష్టమౌతోంది. ఇప్పటికే పలువురు టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు రెడీగా ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయన్న నేపథ్యంలో ఇక జంపింగ్ లు ఉంటాయా లేదా టీఆర్ఎస్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా లేదా అన్న ఆసక్తికర చర్చ జరగుతుంది. లేక కేవలం ప్రచారానికే పరిమితమవుతుందా అన్నది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.