హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 150 డివిజన్లలో 1122 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు. పోటీలో ఉన్న అభ్యర్ధుల వివరాలను ఈసీ సోమవారం నాడు ప్రకటించింది.

డిసెంబర్ 1వ తేదీన జీహెచ్ఎంసీ పోలింగ్ నిర్వహించనున్నారు. డిసెంబర్ 4వ తేదీన  ఎన్నికల కౌంటింగ్ నిర్వహిస్తారు.

జీహెచ్ఎంసీ ఎన్నికలను ప్రధాన పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి. టీఆర్ఎస్ 150, టీడీపీ 106, కాంగ్రెస్ 146, బీజేపీ 149, సీపీఐ 17, సీపీఎం 12 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఇతరులు 491 మంది ఈ ఎన్నికల్లో పోటీలో ఉన్నారు.

నవాబ్ సాహికుంటలో బీజేపీ అభ్యర్ధి పోటీలో లేరు. దీంతో ఆ పార్టీ 149 స్థానాల్లోనే పోటీ చేస్తోంది.

ఈ ఎన్నికల్లో బీజేపీకి జనసేన తన సంపూర్ణ మద్దతును ప్రకటించింది. జనసేన అభ్యర్ధులు పోటీ నుండి తప్పుకొన్నారు. బీజేపీ అభ్యర్ధుల తరపున ప్రచారం నిర్వహించాలని పవన్ కళ్యాణ్ ను  బీజేపీ నేతలు కోరారు. బీజేపీ నేతల అభ్యర్ధనకు జనసేనాని సానుకూలంగా స్పందించారు.