వికారాబాద్ జిల్లాలో జ్వరంతో బాధపడుతున్న 11 ఏళ్ల హరిక అనే బాలిక నిలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.  హరికను తన భుజాలపై ఎత్తుకొని తండ్రి ఆసుపత్రికి తీసుకెళ్లాడు. కానీ చివరికి ఆమె నిలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం నాడు మరణించింది. 

వికారాబాద్:జ్వరంతో ఉన్న బాలికను కష్టపడి భుజాలపై ఎత్తుకొని తండ్రి వాగును దాటించి ఆసుపత్రిలో చేర్పించాడు. అయినా కూడా ఆ బాలిక ప్రాణాలు దక్కలేదు. శనివారం నాడు ఉదయం 11 ఏళ్ల బాలిక హరిక హైద్రాబాద్ నిలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.

వికారాబాద్ జిల్లా తాండూరు మండలం బొంకూరు గ్రామానికి చెందిన బాలప్ప , అమృతమ్మల కూతురు హరిక. ఆమె వయస్సు 11 ఏళ్లు. స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో హరిక 6వ తరగతి చదువుతుంది. ఇటీవల ఆమె స్కూల్ కు వెళ్లి పుస్తకాలు తెచ్చుకొంది. స్కూల్స్ ప్రారంభమయ్యాయి. అయితే వారం రోజులుగా వర్షాలు కురుస్తున్న కారణంగా బొంకూరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో గ్రామస్తులు బయట కాళ్లు పెట్టలేని పరిస్థితి నెలకొంది.

హరికకు రెండు రోజుల క్రితం జ్వరం వచ్చింది. వాగు ఉధృతి కారణంగా ఆసుపత్రికి తీసుకెళ్లలేని పరిస్థితి నెలకొంది. శుక్రవారం నాడు హరికకు జ్వరం మరింత పెరిగింది. దీంతో తండ్రి బాలప్ప తన భుజాలపై కూతురిని మోసుకొని వాగును దాటాడు. బొంకూరు నుండి ఖాంజాపూర్ మీదుగా తాండూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి హరికను చేర్పించాడు.

హరికకు జ్వరం తీవ్రంగా ఉండడంతో తాండూరు వైద్యులు ఆమెను నిలోఫర్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. నిలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ హరిక శనివారం నాడు మరణించింది. బొంకూరు నుండి తాండూరుకు వెళ్లాలంటే వాగును నిర్మించాలనే డిమాండ్ ఏళ్లుగా పరిష్కరించలేదు.