హైదరాబాద్ కృష్ణానగర్‌లోని సాయికృపా పాఠశాలలో పదో తరగతి విద్యార్ధుల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మరణించిన సంగతి తెలిసిందే. దీంతో స్కూల్ యాజమాన్యంపై మృతుడి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

హైదరాబాద్ (hyderabad) కృష్ణానగర్‌లో (krishna nagar) దారుణం జరిగింది. సాయికృపా స్కూల్‌లో (sai krupa high school ) పదో తరగతి విద్యార్ధుల మధ్య ఘర్షణకు ఒక విద్యార్ధి చనిపోయాడు. లంచ్ టైంలో ఈ గొడవ జరిగిందని.. టేబుల్‌పై వాలిపోయి ప్రాణాలు కోల్పోయాడని స్కూల్ కరస్పాండెంట్ చెబుతున్నారు. దీనిపై మృతుడి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్ధులు ఘర్షణ పడుతుంటే ఏం చేస్తున్నారని మండిపడ్డారు. పిల్లల మధ్య గొడవలు జరుగుతుంటే యాజమాన్యం పట్టించుకోలేదని మన్సూర్ బాబాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

దీనిపై పోలీసులు స్పందిస్తూ.. స్కూల్‌లో జరిగిన ఘటనపై విచారణ జరుపుతున్నామని బంజారాహిల్స్ ఏసీపీ పేర్కొన్నారు. పిల్లల మధ్య గొడవేంటో తెలుసుకున్నామని.. పేరేంట్స్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ వెల్లడించారు. స్కూల్ మేనేజ్‌మెంట్ నిర్లక్ష్యం వుంటే చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. 

అంతకుముందు కృష్ణానగర్‌లోని సాయికృపా పాఠశాలలో పదో తరగతి చదువుతున్న నలుగురు విద్యార్థులు బుధవారం తరగతి గదిలో సరదాగా క్రికెట్‌ ఆడుతూ గొడవపడ్డారు. ఘర్షణ తీవ్రమై పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో మన్సూర్ అనే విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతనిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.