మహిళ స్నానం చేస్తుండగా ఓ బాలుడు రహస్యంగా వీడియో తీశాడు.. కాగా ఆ బాలుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన హైదరాబాద్ లోని చంద్రాయణగుట్టలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...జంగమ్మెట్‌ రవీంద్రనాయక్‌ కాలనీకి చెందిన మహిళ (28) ఇంటికి ఎదురుగా ఉన్న ఇంట్లో 17 ఏళ్ల బాలుడి కుటుంబం నివసిస్తోంది. బాలుడు అప్పుడప్పుడు మహిళ ఇంటికి వచ్చి వెళుతుండేవాడు. నెల రోజుల క్రితం మహిళ స్నానం చేస్తుండగా బాలుడు తన సెల్‌ఫోన్‌లో రహస్యంగా వీడియో తీశాడు. వీడియో దృశ్యాలను తన స్నేహితులకు పంపించాడు. 

ఈ విషయం తెలుసుకున్న మహిళ ఈనెల 16న  పోలీసులకు ఫిర్యాదు చేసింది. మూడు రోజులైనా బాలుడిపై చర్యలు తీసుకోవడం లేదని మనస్తాపంతో సదరు మహిళ సోమవారం పోలీసు స్టేషన్‌ ఎదుట ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వీడియో దృశ్యాలను డిలిట్‌ చేయడంతో సైబర్‌క్రైమ్‌ పోలీసులను సంప్రదించామని, నివేదిక అందకపోవడంతోపాటు బాలుడు పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు రాస్తుండడంతో చర్యలు తీసుకోలేదని పోలీసులు మహిళకు నచ్చచెప్పి పంపించారు. 

మహిళ ఆత్మహత్యా యత్నానికి పాల్పడడంతో పోలీసులు స్పందించారు. నిందితుడైన బాలుడిని పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేసి జువైనల్‌హోంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.