ఫేస్ బుక్ పరిచయం ఓ యువతి ప్రాణాలు తీసింది. టెక్నాలజీ.. పరిచయం లేని వ్యక్తులతో కొత్త స్నేహమే ఆ యువతి ప్రాణాలు పోవడానికి కారణమయ్యాయి. ఫేస్ బుక్ స్నేహితుడే ఆమెను అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే....

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని  స్థానిక హౌసింగ్‌ బోర్డులో నివాసముండే రవిశంకర్‌ అనే ప్రభుత్వ ఉద్యోగి కుమార్తె హర్షిణి(15) పదో తరగతి చదువుతోంది. ఆమెకు ఫేస్‌బుక్‌లో రంగారెడ్డి జిల్లా కొహెడ గ్రామానికి చెందిన నవీన్‌రెడ్డి అనే కారు మెకానిక్‌ పరిచయం అయ్యాడు. గత కొంతకాలంగా వీరిద్దరూ ఫేస్ బుక్  మెసేంజర్ సహాయంతో మాట్లాడుకుంటూ ఉన్నారు. 

 కాగా.. ఈ నెల 27న నవీన్ రెడ్డి  జడ్చర్లకు వచ్చి హర్షిణికి మాయమాటలు చెప్పి సమీపంలో శంకరాయపల్లి తండాలోని నిర్మానుష్య ప్రాంతానికి కారులో తీసుకువెళ్లాడు. అక్కడ ఆమె పై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. దీంతో బండరాయితో కొట్టి హత్యచేశాడు. కాగా ఇంటి నుంచి బయటకు వెళ్లిన హర్షిణి తిరిగి ఇంటికి రాకపోవంతో కంగారు పడిన కుటుంబసభ్యులు చుట్టుపక్కల గాలించారు. అయినా సమాచారం దొరకకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

కేసు నమోదు చేసిన పోలీసులు చుట్టుపక్కల గాలించగా హర్షిణి శవమై కనిపించింది. ఆమెను ఎవరో హత్య చేసినట్లు అర్థమయ్యింది. కాగా... ఆమె ఫేస్ బుక్ ని చెక్ చేయగా... నవీన్ రెడ్డి అనే వ్యక్తిపై పోలీసులకు అనుమానం కలిగింది. ఆ తర్వాత హర్షిణి ఇంటి సమీపంలోని సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా నిందితుడిని విచారించగా హత్యచేసినట్లు అంగీకరించడాడు. గురువారం తెల్లవారుజామున పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బాదేపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధిత కుటుంబీకులను ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పరామించారు.