తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జోరుగా సాగుతోంది. నగరంలోని ఫిల్మ్ నగర్ క్లబ్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో వెయ్యికి పైగా ఓట్లు గల్లంతయ్యాయి. పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఓటర్లు పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చారు.

అయితే.. ఓటు వేయడానికి వెళ్లిన చాలా మంది ఓటర్లకు తమ పేరు ఓటర్ల జాబితాలో లేదని తేలింది. దీంతో.. వారు నిరాశతో ఇంటికి వెనుదిరిగారు. దాదాపు వెయ్యి ఓట్లకు గల్లంతైనట్లు సమాచారం. ఓటరు గుర్తింపు కార్డు ఉన్నప్పటికీ జాబితాలో తమ పేర్లు లేకపోవడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.

శుక్రవారం ఉదయం ఏడుగంటలకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ మొదలైన సంగతి తెలిసిందే. 119 నియోజకవర్గాల్లోని 32,185 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సిబ్బంది ఓటింగ్‌ను ప్రారంభించారు.  మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి 48శాతం ఓటింగ్ నమోదైంది.  మావోయిస్టు ప్రాబల్యం ఉన్న 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరగనుండగా.. మిగిలిన ప్రాంతాల్లో షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఎన్నికల సంఘం ప్రకటించింది.