ఓ పదేళ్ల బాలుడు లిప్ట్‌ ప్రమాదం కారణంగా మృతిచెందిన విషాద సంఘటన మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది. ఓ అపార్ట్ మెంట్ లోని లిప్ట్‌ డోర్స్ మూస్తుండగా హఠాత్తుగా కదలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. 

ఆంధ్ర ప్రదేశ్ ప్రకాశం జిల్లాకు చెందిన నరసింహ భార్య పిల్లలతో కలిసి ఉపాధి నిమిత్తం హైదరాబాద్ కు వలస వచ్చాడు. మేడ్చల్ బాలాజీ నగర్ లోని తిరుమల నిలయం అపార్ట్ మెంట్ లో అతడు వాచ్ మెన్ గా పనిచేస్తున్నాడు. కుటుంబంతో కలిసి అదే అపార్ట్ మెంట్ సెల్లార్ లోని ఓ గదిలో నివాసముంటున్నాడు. అయితే  అతడి పదేళ్ల కొడుకు హేమంత్ కుమార్ ఇవాళ ప్రమాదవశాత్తు లిప్ట్ ప్రమాదంలో చిక్కుకుని మృతిచెందాడు. 

తిరుమల నిలయం అపార్ట్  మెంట్ సమీపంలోని ఓ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న హేమంత్ ఇవాళ మద్యాహ్నమే ఇంటికి వచ్చాడు. ఇంట్లో తల్లిదండ్రులు లేకపోవడంతో అపార్ట్ ఆవరణలోనే కొద్దిసేపు ఆడుకున్నాడు. అనంతరం లిప్ట్ లో మూడో అంతస్తుకు వెళ్లి తిరిగి వస్తుండగా డోర్స్ మద్యలో ఇరుక్కుని ప్రమాదానికి గురయయ్యాడు. 

మొదటి అంతస్తులోకి చేరిన లిప్ట్ లో హేమంత్ మృతదేహాన్ని గుర్తించిన కొందరు అపార్ట్  మెంట్ వాసులు తండ్రికి సమాచారమిచ్చారు. దీంతో తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీసి కన్నీరు మున్నీరుగా విలపించారు. 

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాలుడి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తరలించారు.ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.