హైదరాబాద్: శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద సోమవారం నాడు తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ మృతి చెందాడు. ప్రమాదం జరిగిన స్థలానికి మూడు కి.మీ దూరంలో డీసీఎం డ్రైవర్ మృతదేహం లభ్యమైంది.

షోలాపూర్ నుండి హైద్రాబాద్‌కు ద్రాక్షపండ్ల లోడుతో వస్తున్న డీసీఎం  సోమవారం తెల్లవారుజామున శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డులో మాదలపల్లి వద్ద ప్రమాదానికి గురైంది.

ఆగిఉన్న వాహనాన్ని డీసీఎం ఢీకొట్టినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే రోడ్డుపై అడ్డంగా ఉన్న వాహనాన్ని పోలీసులు పక్కకు తీశారు.డీసీఎం డ్రైవర్  కోసం పోలీసులు సమీప ఆసుపత్రుల్లో గాలింపు చర్యలు చేపట్టారు. కానీ ఎక్కడ కూడ ఆయన ఆచూకీ లభ్యం కాలేదు.

డీసీఎం డ్రైవర్ కోసం గాలింపు చేపడితే రోడ్డు ప్రమాదం జరిగిన ఘటన స్థలానికి మూడు కి.మీ దూరంలో  డీసీఎం డ్రైవర్ మృతదేహం లభ్యమైంది. ఈ మృతదేహం ప్రమాదం జరిగిన 8 గంటలకు దొరికింది.

ప్రమాదం జరిగిన స్థలానికి మూడు కి.మీ. దూరానికి మృతదేహం ఎలా వచ్చిందనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుపై ఉన్న సీసీ పుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు.