Asianet News TeluguAsianet News Telugu

భూమి లాక్కుంటున్నారని సెల్పీ వీడియోలో ఆవేదన.. యువరైతు ఆత్మహత్య యత్నం.. నిలకడగా ఆరోగ్యం

చాలా కాలంగా సాగుచేసుకుంటున్న తమ భూమిని లాక్కుంటున్నారనే ఆవేదనతో ఓ యువ రైతు ఆత్మహత్యకు యత్నించాడు. తాను ఆత్మహత్యకు యత్నిస్తున్న వీడియోను సోషల్ మీడియాలో కూడా పోస్టు చేశారు. 

" Extremely painful incident" : telangana bjp chief bandi sanjay tweet on medak farmer and his mother suicide
Author
Medak, First Published Aug 7, 2022, 8:44 PM IST

చాలా కాలంగా సాగుచేసుకుంటున్న తమ భూమిని లాక్కుంటున్నారనే ఆవేదనతో ఓ యువ రైతు ఆత్మహత్యకు యత్నించాడు. తాను ఆత్మహత్యకు యత్నిస్తున్న వీడియోను సోషల్ మీడియాలో కూడా పోస్టు చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం దేవులపల్లి‌లో చోటుచేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. అయితే తొలుత రైతు మరణించాడని వార్తలు వెలువడిన.. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరోవైపు యువ రైతు తల్లి కూడా ఆత్మహత్య చేసుకున్నాడని ప్రచారం జరిగిన అందులో నిజం లేదని తేలింది.  అసలేం జరిగిందంటే.. దేవులపల్లి గ్రామానికి చెందిన జింక శ్రీశైలంకు గ్రామ శివారులోని అటవీభూమి పక్కన సాగుభూమి ఉంది. అందులో వరితోపాటు మిరప పంట సాగు చేశారు.

కొన్ని నెలల క్రితం శ్రీశైలం సాగు చేస్తున్న భూమితో పాటు పక్కనే ఉన్న ఐదెకరాలకు బృహత్‌ పల్లె ప్రకృతి వనం మంజూరైంది. అటవీశాఖ అధికారులు దీనికోసం ఐదు ఎకరాల స్థలం కేటాయించారు. శనివారం అక్కడికి వచ్చిన అటవీ శాఖ అధికారులు.. మిగతా భూమితోపాటు శ్రీశైలం పోడు చేసుకుంటున్న అటవీభూమిని సైతం దున్ని చదును చేయాలని సిబ్బందికి చెప్పారు. దీంతో శ్రీశైలం ఈ భూమిని తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్నామని అధికారులకు తెలిపారు. ఈ భూమిని లాక్కుంటే తమకు చావే పరిష్కారమని శ్రీశైలం, అతని కుటంబ సభ్యులు పేర్కొన్నారు. 

దీంతో అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనపై శనివారం కౌడిపల్లి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే శ్రీశైలం తన బాధను సెల్ఫీ వీడియో ద్వారా తెలిపి వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు చేశాడు. గడ్డి మందు తాగి అక్కడే కిందపడిపోయాడు.  వీడియోను చూసిన కొందరు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం అతడిని మెదక్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శ్రీశైలం ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లుగా తెలుస్తోంది. 

వివరణ.. అయితే శ్రీశైలం ఆత్మహత్య యత్నం వీడియో వైరల్‌గా మారడంతో చాలా మంది ఆయన చనిపోయారని ప్రచారం చేశారు. పలువురు రాజకీయ పార్టీల నాయకులు కూడా సోషల్ మీడియాలో శ్రీశైలం సెల్పీ వీడియోను పోస్టు చేశారు. ప్రాథమిక సమాచారం మేరకు ఏషియా నెట్ న్యూస్ ‌కూడా కథనాన్ని అలానే తీసుకుని ప్రచురించడం జరిగింది. అయితే తర్వాత అందిన సమాచారం ప్రకారం.. శ్రీశైలం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా తెలిసింది. దీంతో మొదట ప్రచురించిన కథనం పట్ల మేము చింతిస్తున్నాం. శ్రీశైలం వేగంగా కోలుకుకోవాలని మేము బలంగా ఆశిస్తున్నాం. 

 

Follow Us:
Download App:
  • android
  • ios