న్యూఢిల్లీ: అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్‌ అనుబంధ ఈ-కామర్స్‌ సంస్థ ‘ఫ్లిప్‌కార్ట్‌’ ఉచిత వీడియో స్ట్రీమింగ్‌ సేవలను త్వరలో ప్రారంభించనుంది. తద్వారా పోటీ సంస్థ అమెజాన్‌ను ఎదుర్కోవాలని భావిస్తోంది. పలు భాషల్లో ఈ ఫ్లాట్‌ఫామ్‌ను తీసుకురానున్నది.

‘ఫ్లిప్‌కార్ట్‌ వీడియోస్‌’ పేరిట ప్రారంభించనున్న ఈ సేవలు.. ఫ్లిప్‌కార్ట్‌ యాప్‌పై కస్టమర్లకు ఉచితంగా లభిస్తాయి. లఘు చిత్రాలు, పూర్తి స్థాయి సినిమాలు, సీరియళ్లు ఇందులో వీక్షించొచ్చు. వీటిని విస్తరించడానికి కంటెంట్‌ రూపకర్తలతో చర్చలు జరుపుతున్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. 

ఈ-కామర్స్‌ కంపెనీలకు కీలకమైన పండుగల సీజన్‌ నేపథ్యంలో కంపెనీ ఈ దిశగా అడుగులు వేస్తోంది. ‘వీడియో సేవలపై భారీగా పెట్టుబడులు పెట్టనున్నాం. షాపింగ్‌తోపాటు వినియోగదారులు వినోదాన్ని సైతం ఇష్టపడుతున్నారు. కస్టమర్లు మెచ్చే వీడియోలను అందుబాటులోకి తెస్తాం’ అని ఫ్లిప్‌కార్ట్‌ సీఈఓ కల్యాణ్‌ కృష్ణమూర్తి పేర్కొన్నారు. 

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌కు 15 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. ఫ్లిప్‌కార్ట్‌ను హిందీ భాషలోకి తేవడం ద్వారా ఈ సంఖ్యను 20 కోట్లకు పెంచుకుంటామని అన్నారు. రాబోయే నెలల్లో తమిళ్‌, తెలుగు, బెంగాలీ భాషల్లో సైతం తీసుకొస్తామని చెప్పారు.